మీనాలు మిలమిల
నాతవరం: తాండవ జలాశయం ఒడ్డున గురువారం మత్స్యకార దినోత్సవం సందడిగా జరిగింది. కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొని రిజర్వాయర్‌లో ఐదు లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా తాండవ ప్రాజెక్టు వద్ద మత్స్యకారులతో ముచ్చటించారు. చేపల పెంపకం ద్వారా తాండవ ప్రాజెక్టు పరిధిలో గల 30 గ్రామాల్లో వేట సాగించే మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 44 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయని, వాటిలో 3 వేలమందికి పైగా సభ్యులు ఉన్నారన్నారు. వారందరికీ త్వరలో రాయితీపై వలలు, బోట్లు అందిస్తామన్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ప్రమాదాల్లో ఆరుగురు మత్స్యకారులు మరణించారని, త్వరలో వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేస్తామన్నారు.
కలెక్టర్ దృష్టికి సమస్యలు
ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. తాండవ ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు భూములకు నీరందించే ప్రధాన కాలువల్లో పూడిక పేరుకుపోయి శివారు ఆయకట్టుకు నీరు ప్రవహించడం లేదని, ఖరీఫ్ సీజన్ అనంతరం పూడిక పనులు చేపట్టాలని మాజీ జెడ్పీటీసీ కరక సత్యనారాయణ కలెక్టరుకు వినతి పత్రం అందించారు. తాండవ రిజర్వాయరుకు సమీపంలో ఉన్న హెల్త్ సబ్ సెంటరును చమ్మచింత తరలించారని, సబ్ సెంటరు ఈ ప్రాంతంలో ఉంటే 8 గ్రామాల్లోని 5 వేల మంది ప్రజలకు వైద్యం అందుతుందని మండల కోఆ్‌ప్షన్ సభ్యుడు షేక్ రజాక్ అన్నారు. తాండవ నదిలో కూటమి పార్టీల నేతలు నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, వాటిని అరికట్టాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీ సభ్యురాలు కాపారపు అప్పలనర్స, మండల ప్రత్యేకాధికారి నాగ శిరీష, మత్స్యశాఖ ఏడీ జాహ్నవి, నర్సీపట్నం మత్స్యశాఖాధికారి నాగమణి, ఎంపీడీవో ఉషశ్రీ,, స్ధానిక సర్పంచ్ కొండబాబు, తాండవ ప్రాజెక్టు మాజీ చైర్మన్ పారుపల్లి కొండబాబు, మత్స్యకార సంఘాల అధ్యక్షుడు నక్కా రమణ పాల్గొన్నారు.
తాండవ రిజర్వాయర్ సందర్శన
ఖరీఫ్ సీజన్‌లో ఆయకట్టు రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే బాధ్యత మీపైనే ఉందని కలెక్టర్ విజయ కృష్ణన్ తాండవ ప్రాజెక్టు అధికారులతో అన్నారు. ఆమె మొదటిసారి గురువారం తాండవ రిజర్వాయరును సందర్శించి ప్రాజెక్టులో నీటి నిల్వలను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను డీఈ అనురాధను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉన్నందున నీటిని పుష్కలంగా అందించాలని డీఈకి సూచించారు. ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు.
పండగను తలపించేలా తాండవలో మత్స్యకార దినోత్సవం
జలాశయంలో 5 లక్షల చేప పిల్లలు విడుదల చేసిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment