‘పాట’కుల శేఖరుడు
● సినీ గేయరచయిత కులశేఖర్ మృతి ● సింహాచలం జన్మస్థలం ● విలేకరిగా జీవిత ప్రస్థానం ● సిరివెన్నెల సీతారామశాస్త్రిశిష్యుడిగా గుర్తింపు ● ఎన్నో పాటలకు సాహిత్యం అందించిన గేయరచయిత
సింహాచలం: గాజువాక పిల్లా...మేము గాజులోల్లం కాదా.... అంటూ తన సాహిత్యంతో సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గేయరచయిత కులశేఖర్ (53) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం హైదరాబాద్‌లో మృతిచెందారు. విశాఖలోని సింహాచలంలో జన్మించిన ఆయన అనతికాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో గేయ రచయితగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. నగరంలోని ఒక కళాశాలలో డిగ్రీ , ఏయూలో ఎంఏ సంస్కృతం చదివిన కులశేఖర్ తొలినాళ్లలో విశాఖలోనే ఒక దినపత్రికలో విలేఖరిగా పనిచేశారు. ఆ తర్వాత ఓ చానల్‌లో ఉద్యోగంలో చేశారు. ఆదినుంచీ తెలుగు భాష, సాహిత్యంపైన పట్టు ఉన్న కులశేఖర్‌కు సినీ గేయరచయిత అవ్వాలన్న కోరిక ఉండేది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో పరిచయం ఉండటంతో ఆయనవద్ద శిష్యుడిగా చేరారు. 2000 సంవత్సరంలో వచ్చిన చిత్రం సినిమా ద్వారా గేయరచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత అనతికాలంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. అప్పటి యువత హృదయాలని హత్తుకునే ఎన్నో పాటలను కులశేఖర్ అందించారు. నువ్వునేను, జయం, సంతోషం, ఇంద్ర, నిజం, వసంతం, ఘర్షణ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. తదితర చిత్రాలకు పాటలు రాశారు. వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రానికి మాటలు కూడా కులశేఖరే సమకూర్చారారు.
సింహాచలం స్థానాచార్యులు రాజగోపాల్‌కు సోదరుడు
కులశేఖర్ తండ్రి పేరు టి.పి.శ్రీరామచంద్రాచార్యులు, తల్లి రంగనాయకమ్మ. వీరికి తొమ్మిదిమంది సంతానం.. కాగా కులశేఖర్ ఆఖరివాడు. శ్రీ రామచంద్రాచార్యులు నగరంలోని ఏవీఎన్ కళాశాలలో తెలుగు విభాగాధిపతిగా పనిచేసి 2012లో పరమపదించారు. కులశేఖర్‌కి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సింహాచలం దేవస్థానంలో ప్రస్తుతం స్థానాచార్యులుగా విధులు నిర్వర్తిస్తున్న టి.పి.రాజగోపాల్ కులశేఖర్ సోదరుడే. కులశేఖర్ మృతిచెందాడన్న వార్త సింహాచలం గ్రామస్తులను కలచివేసింది. సామాజిక మాధ్యమాల్లో కులశేఖర్ మృతిచెందారన్న వార్తలను చూసి అయ్యో పాపం అంటూ ఆయన అందించిన పాటలను పలువురు గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment