ప్రజలపై రూ.11 వేల కోట్ల విద్యుత్ భారం
నర్సీపట్నం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని సీఐటీయూ జి.కోటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చారని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయన్నారు. కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారం వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ.11 వేల కోట్ల విద్యుత్ భారాన్ని మోపిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తున్నారని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. వీటన్నింటికి నిరసనగా జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రదర్శనల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ ధర్నాలో సీఐటీయు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సాపిరెడ్డి నారాయణమూర్తి, ఐద్వా జిల్లా ట్రెజరర్ సూర్యప్రభ, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి, ఆశా జిల్లా నాయకులు వి.సత్యవతి, మిడ్డేమిల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె.ప్రసన్న, అంగన్‌వాడీ నాయకులు సామ్రాజ్యం, మంగతాయారు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై సీఐటీయూ నిరసన
ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా
Comments
Please login to add a commentAdd a comment