అడవిపంది దాడిలో గొర్రెల కాపరి మృతి
నాతవరం : గొర్రెల కాపరిని అడవి పంది దాడి చేసి చంపేసిన సంఘటన గ్రామస్థుల్లో భయాందోళన కలిగించింది. నాతవరం ఎస్‌ఐ సిహెచ్.భీమరాజు నాతవరం ఫారెస్టు సెక్షన్ అధికారి చిరంజీవి అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో శృంగవరం గ్రామానికి చెందిన నీలి నాగేశ్వరరావు (62) ఎప్పటిమాదిరిగానే తమ గొర్రెలను మేత కోసం మంగళవారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. సమీపంలో వరి పంట పొలాలు కూడా ఉన్నాయి. గొర్రెల మేత మేస్తుండగా అందులో ఒక గొర్రెను అడవి పంది గాయపరిచి పట్టుకుపోతుండగా గొర్రె అరవడంతో గమనించిన నాగేశ్వరరావు అడవి పంది వెంట పరిగెత్తుకుంటూ వెళ్లి కర్రతో కొట్టాడు. అడవి పంది గొర్రెను వదిలి నాగేశ్వరరావుపై దాడి చేసింది. వరి చేనులో దొర్లించి గాయపరించి చంపేసింది. ఆ సంఘటన చుట్టు పక్కల ఉన్న రైతులు గమనించి గ్రామంలో కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. కుమారుడు దుర్గా ప్రసాద్ వచ్చి తన తండ్రి వరి చేనులో తీవ్ర గాయాలతో మరణించి పడి ఉండడాన్ని చూసి బోరున విలపించాడు. అటవీ శాఖ అధికారులు వచ్చి అడవి పంది సంచరించిన ప్రాంతాలను పరిశీలించారు. మృతుడు నాగేశ్వరరావుకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై నాతవరం ఎస్‌ఐ సిహెచ్.భీమరాజు సంఘటన స్థలంలో మృతదేహన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment