ఎన్నికల్లో అనర్హత వేటుకు కుయుక్తులు
● నీటితీరువా కట్టించుకోవద్దని వీఆర్వోలపై అధికార పార్టీ ఒత్తిళ్లు ● తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు గొడిచర్ల రైతులు సిద్ధం
నక్కపల్లి: సాగునీటి సంఘాల ఎన్నికల్లో గెలిచే సత్తా లేకపోవడంతో ప్రత్యర్థులు పోటీ చేయకుండా కూటమి పార్టీల నాయకులు కుయుక్తులు పన్నుతున్నారు. తమకు ఎదురు తిరిగి పోటీ చేసే రైతుల భూములకు నీటితీరువా కట్టించుకోకుండా వీఆర్వోలపై ఒత్తిళ్లు తెస్తున్నారు. తద్వారా పోటీలో అభ్యర్థులను అనర్హులను చేసి దొడ్డి దారిన గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వైస్ ఎంపీపీ వీసం నానాజీ ఆధ్వర్యంలో గొడిచర్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు నక్కపల్లి తహసీల్దార్ నర్సింహమూర్తికి గురువారం ఫిర్యాదు చేశారు. బాపిరాజు చెరువు, కొత్త చెరువుల ఆయకట్టు పరిధిలోని రెండు నీటి సంఘాల్లోను వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. 14వ తేదీన జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్న రైతులు గురువారం నీటితీరువా చెల్లించేందుకు సచివాలయానికి వెళ్లారు. అక్కడ వీఆర్వో నీటితీరువా కట్టించుకుంటానని చెప్పిన కొద్దిసేపటికి ఫోన్ రావడంతో తహసీల్దార్ రమ్మన్నారని వెళ్లిపోయాడు. తర్వాత ఎంతకీ గ్రామానికి రాకపోవడంతో.. ఒక్కరోజే సమయం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. శుక్రవారం నీటితీరువా కట్టించుకోకపోతే తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ విషయమై తహసీల్దార్ నర్సింహమూర్తి వద్ద ప్రస్తావించగా వీఆర్వోను సచివాలయానికి పంపించి నీటితీరువా కట్టించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment