కౌలుదారుల పేరిట దేవాలయం భూములు
● గుర్తించిన నర్సీపట్నం డివిజన్ దేవదాయ శాఖాధికారి ● తహసీల్దార్ వేణుగోపాల్‌తో కలిసి వి.బి.అగ్రహారంలో సర్వే
నాతవరం: దేవదాయ ధర్మదాయ శాఖకు చెందిన భూములు కౌలుదారుల పేరిట ఉండరాదని తహసీల్దార్ ఎ.వేణుగోపాల్ స్పష్టం చేశారు. మండలంలో వి.బి.అగ్రహారంలో పురాతన శివాలయానికి సుమారుగా 50 ఎకరాలు భూమి ఉంది. ఈ భూమిని దేవదాయ అధికారులు పంట ఫలసాయం నిమిత్తం కౌలుకు వేలం పాట నిర్వహిస్తుంటారు. ఈ భూమిని గతంలో కౌలుకు తీసుకున్న వారు వన్‌బీతో పాటు సాగు హక్కులో పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇటీవల నర్సీపట్నం డివిజన్ దేవదాయ ధర్మదాయ శాఖాధికారిగా వచ్చిన కె.దివ్యతేజ ఈ విషయాన్ని గుర్తించారు. మన్యపురట్ల గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామసభ అనంతరం తహసీల్దార్, గ్రామ పెద్దలతో కలిసి ఆ భూమిని పరిశీలించి మండల సర్వేయర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సర్వే చేశారు. రెండు జిల్లాలు సరిహద్దులో ఉన్న ఈ భూమి ఆక్రమణకు కాకుండా హద్దులు నిర్ణయించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు భూములను స్వయంగా పరిశీలించి ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపడతామన్నారు. శివాలయం భూములు కొంత మంది పేర్ల మీద ఉన్నాయని, నిబంధనలు ప్రకారం ఆలయం పేరు మీద మార్పు చేస్తామన్నారు. మండలంలో నాతవరం వై.డి.పేట, ఎం.బెన్నవరం పంచాయతీల్లో దేవదాయ శాఖకు భూములు ఉన్నాయని ఇండోమెంట్ అధికారి కె.దివ్యతేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శివ, తాండవ నీటి ప్రాజెక్టు మన్యపురట్ల సిగ్మెంట్ అధ్యక్షుడు అప్పన దివాణం, మాజీ వైస్ ఎంపీపీ చిట్టిబాబు, మాజీ సర్పంచులు వీసం నూకరాజు, వనిమిన సూర్యారావు, వీఆర్వోలు చలపతి, సత్తిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment