డెకింగ్ కర్రలు విరిగి భవన నిర్మాణ కార్మికులకు గాయాలు
తుమ్మపాల : కాపుశెట్టివానిపాలెంలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం వద్ద ఆదివారం డెకింగ్ కర్రలు విరిగిపోయి ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిని ఆనుకుని ఆస్పత్రి నిర్మాణం కోసం అండర్ గ్రౌండ్, రెండంతస్తుల భవన నిర్మాణ జరుగుతోంది. వేగంగా పనులు పూర్తి చేసేందుకు భవన యాజమానులు శ్రీకాకుళం నుంచి భవన నిర్మాణ కార్మికులను తీసుకొచ్చి నిత్యం పనులు చేయిస్తున్నారు. ఆదివారం సెలవు అయినప్పటికీ ఉదయం నుంచే పనులు చేపట్టేందుకు సిద్ధమైన కూలీలు రెండో అంతస్తులో బయటి వైపున గల గోడలకు ప్లాస్టింగ్ చేస్తున్న సమయంలో వారు నిల్చున్న డెకింగ్ కర్రలు విరిగిపోయి ఒక్కసారిగా కింద పడిపోయారు. దీంతో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపాడ గ్రామానికి చెందిన జీరు చిన్నారావుకు నడుంపై గాయాలయ్యాయి. ఎల్.సోమేశ్వరరావు, కృష్ణారావుకు తలపై తీవ్రగాయాలై కాళ్లు విరిగిపోయాయి. వీరిని 108 సహాయంతో స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించినప్పటికీ మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు డెకింగ్ కర్రలు నానిపోవడంతో బరువుకు విరిగిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment