జిల్లా వ్యాప్తంగా రైతులు 2,40,000
ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులు 1,42,000
తడిచిన వరి చేనును ఒడ్డుకు చేర్చుతున్న రైతు
వరుస విపత్తులు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. అవసరం లేని సమయంలో అకాల వర్షాలు, సీజన్‌లో వర్షాభావం అన్నదాతలను నిండా ముంచేశాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో మొదటి నుంచి ప్రకృతి వైపరీత్యాలు కర్షకులను అవస్థలు పాలు చేశాయి. మొదట్లో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తూ రైతులు కాలం గడిపారు. తరువాత పంట చేతికి వస్తున్న సమయంలో వచ్చిన తుపాన్లు రైతులను నిండా ముంచాయి. మరో వైపు కూటమి ప్రభుత్వం అన్నదాతల వైపు కనీసం కన్నెత్తికూడా చూడడం లేదు.
మాడుగుల: జిల్లాలో సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో తుపానుల ప్రభావం ఉంటుంది. ప్రతి ఏటా డిసెంబరు, జనవరి నెలల్లో ఖరీఫ్ వరి కోతలు, నూర్పుళ్లు జరుపుతారు. ఈ ఏడాది మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ వరి కోతలు నవంబరు నుంచి ప్రారంభమై కొనసాగుతున్నాయి. జిల్లాలో 2,40, 000 మంది రైతులుండగా, ఈ ఏడాది 56,410 హెక్టార్లలో 1,42,000 మంది రైతులు వరి సాగు చేశారు. సీజన్ ప్రారంభం నుంచి వాతావరణం అనుకూలించకపోవడంతో అన్నదాతలు తీవ్ర అవస్థలపాలయ్యారు.
మొదట్లో వర్షాభావం
జులైలో కురవ వలసిన వర్షాలు కినుక వహించడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆకు ఎండిపోయింది. మళ్లీ నారును సేకరించి వేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సుమారు వెయ్యి ఎకరాల్లో నారు వేయవలసి వచ్చింది. మిచాంగ్ తుపాను కారణంగా వరిచేను ముంపునకు గురైంది. ఫెంగల్ తుపాను రైతులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ఈ తుపాను కారణంగా జిల్లాలో 30 శాతం వరి పంట దెబ్బంది. తాజాగా అల్పపీడనం వల్ల కురిసిన వర్షాలతో అన్నదాత కష్టం వర్షార్పణమైంది. పొలాల్లో వరిచేను, కోతలు కోసి ఆరబెట్టిన పనలు, నూర్చి రాశులుగా వేసిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. పొలాల్లో ఉంచిన వరి కుప్పలు తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ధాన్యం రంగుమారడం, మొలకెత్తడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో పలువురు రైతులు తక్కువ ధరకే దళారులకు ధాన్యం అమ్ముకున్నట్టు సమాచారం.
అధిక శాతం తేమ చూపించి..
రైతు సేవా కేంద్రాల్లో శాంపిల్‌ను ఒకే చేస్తున్నారు. తేమ శాతం కూడా 17 లోపు వస్తోందని చెబుతున్నారు. తీరా మిల్లర్ల దగ్గరకు వెళ్లిన తర్వాత 26 శాతం తేడా చూపించి క్వింటాళ్లకు 5 కిలోలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారని రైతులు చెబు తున్నారు. వర్షాలకు తడిసి ముద్దయిన గింజలు ఎండబెట్టి శుభ్రం చేసినా ఫలితం లేకపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూలీల కొరత ..
చేలన్నీ ఒకే సారి పంట దశకు చేరడంతో కూలీలు దొరకక అదునులో వరి కోతలు చేయలేకపోయారు. ఒక్కో కూలీకి రోజుకు రూ.500 నుంచి రూ.900 వరకు చెల్లించవలసి వచ్చింది. తుపాను హెచ్చరికలు వచ్చినా కూలీల కొరత వల్ల పంటను రక్షించుకోలేకపోయినట్టు రైతులు తెలిపారు.
కన్నీటి సాగు..
అందని రైతు భరోసా
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా రూ.13,500 రైతులకు అందించి ఆదుకునే వారు. అది కాకుండా పంట నష్టం జరిగితే వెంటనే నష్టపరిహారం చెల్లించేవారు. రైతుల ఇబ్బందులను కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని పలువురు వాపోయారు. వరుస తుపానుల కారణంగా జిల్లాలో 40 శాతం మంది రైతులు పంటలు నష్టపోయారు.
ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం
56,410 హెక్టార్లు
ధాన్యం కొనుగోలు కేంద్రాలు 364
ప్రభుత్వం ఆదుకోవాలి
ఆరుగాలం కష్టించి పండించిన ఎకరా వరి చేను వర్షాల కారణంగా తడిసిపోయింది. తినడానికి గింజలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో రైతు భరోసా అందేది. ఈ ప్రభుత్వంలో ఒక్క పైసా ఇంకా అందలేదు.ఇప్పటికై న ప్రభుత్వం ఆదుకోవాలి.
–తమడాల కొండబాబు, రైతు, సత్యవరం,
అప్పులు మిగిలాయి
అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వరి సాగుచేశాను. అల్పపీడనం కారణంగా పంట మునిగిపోయింది. దీంతో కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు.
– బి.అప్పారావు, రైతు, సత్యవరం
రెల్లరాల్చు పురుగు... కన్నీరు మిగిల్చె
రెల్లరాల్చు పురుగు జిల్లాలో అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పలు మండలాల్లో ధాన్యం గింజలు నేలపాలయ్యాయి. దేవరాపల్లి, రావికమతం, రోలుగుంట, సబ్బవరం తదితర మండలాల్లో అపారనష్టం కలిగించింది. ఆర్జీఎల్ రకం వేసిన పొలాల్లో ఈ సమస్య ఏర్పడింది. దీంతో దిగుబడి బాగా తగ్గిపోయింది. పురుగు మందుల ధరలు కూడా పెరగడంతో రైతులపై అదనపు భారం పడింది.
Comments
Please login to add a commentAdd a comment