పుణ్యకోటి వాహనంపై పురుషోత్తముడు
నక్కపల్లి: ప్రముఖపుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో పుణ్యకోటి వాహనంపై స్వామివారికి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. కొండపై కల్కి అవతారంలో వెలసిన మూలవిరాట్‌కు విశేష పూజలు జరిపారు. కొండదిగువన క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, గోదాదేవి అమ్మవారికి, స్వామివారి ఉత్సవమూర్తులకు నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం ఉభయదేవేరులతో కూడిన స్వామివారిని పుణ్యకోటి వాహనంపైన, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి మాడవీధుల్లో తిరువీధిసేవలు నిర్వహించారు. తర్వాత గోదాదేవి అమ్మవారి మూలవిరాట్ సన్నిధి వద్ద అమ్మవారి వ్రతదీక్షలో భాగంగా తిరుప్పావైలోని ఏడవ పాశురంతో ప్రత్యేక నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం తీర్థగోష్టి,ప్రసాద నివేదన, ప్రసాద వినియోగం జరిగాయి.ఈ కార్యక్రమాల్లో ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, అర్చకస్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, సాయి, రాజగోపాలాచార్యులు,దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment