నర్సీపట్నం కౌన్సిల్ సమావేశంపై ఉత్కంఠ
● టీడీపీ వార్డులకు అధికంగా నిధుల కేటాయింపు ● అభ్యంతరం తెలిపిన చైర్‌పర్సన్ ● ఎజెండాపై సంతకం చేయని వైనం ● వాయిదా కోరుతూ కమిషనర్‌కు లేఖ
నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి మంగళవారం బడ్జెట్ సమావేశం జరగాల్సి ఉంది. దీనికి వైఎస్సార్‌సీపీకి చెందిన చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అంగీకారం తెలిపారు. దీంతో పాటు జరగాల్సిన సాధారణ సమావేశం ఎజెండాకు ఆమె అంగీకారం తెలపలేదు. ఎజెండాపై సంతకం చేయలేదు. మున్సిపాలిటీకి వీఎంఆర్‌డీఏ నుంచి సుమారు రూ.4 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను టీడీపీ వార్డులకు ఎక్కువగా కేటాయిస్తూ అధికారులు ఎజెండాను రూపొందించారు. దీనిపై అభ్యంతరం చెప్పిన చైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి నిధులను అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఎజెండాను మార్పు చేసేందుకు వీలుపడదని కమిషనర్ సురేంద్ర చెప్పడంతో చైర్‌పర్సన్ సంతకం చేసేందుకు నిరాకరించారు. 28 మంది కౌన్సిల్ సభ్యులు ఉన్న కౌన్సిల్‌లో వైఎస్సార్‌సీపీ 15 మంది కౌన్సిలర్లు, టీడీపీ 12, జనసేన ఒక కౌన్సిలర్ ఉన్నారు. స్పీకర్‌గా ఉన్న స్థానిక శాసన సభ్యుడు సిహెచ్.అయ్యన్నపాత్రుడు ఎక్స్‌ఫిషియా సభ్యులుగా హాజరయ్యే అవకాశం ఉంది. వైఎస్సార్‌సీపీ నుంచి ఎన్నికై న ఒకరు టీడీపీకి మద్దతుగా ఉన్నారు. కౌన్సిల్ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్లు ఇద్దరు వైఎస్సార్‌సీపీకి చెందినవారే. చైర్‌పర్సన్ సంతకం లేని ఎజెండాను కౌన్సిల్‌లో ప్రవేశపెట్టే అవకాశం లేదు. నేడు కౌన్సిల్ సమావేశంలో సాధారణ ఎజెండా ఉంటుందా లేదా..ఉంటే ఏవిధంగా ఆమోదం పొందుతుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వాయిదా కోరుతూ లేఖ...
నేడు జగరాల్సిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి కోరారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ మృతితో కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ సమయంలో బడ్జెట్ ప్రవేశపెడితే అలాంటి ఆర్థిక మేధావిని అగౌరపరిచినట్లు అవుతుంది. బడ్జెట్ సమావేశం నిర్వహించడం సరైన నిర్ణయం కాదనని చైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి కమిషనర్ సురేంద్రకు సోమవారం అత్యవసరంగా లేఖ పంపారు.
Comments
Please login to add a commentAdd a comment