● ఇంటింటికీ తిరిగి పింఛన్లపై తనిఖీలు ● నకిలీ ధ్రువీకరణ పత్రాలగుర్తింపునకు చర్యలు
తుమ్మపాల : జిల్లాలో సదరం సర్టిఫికెట్స్ తనిఖీకి షెడ్యూలు రూపొందించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, సెర్ప్ సీఈవో వీరపాండ్యన్ అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ విజయ కృష్ణన్ హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను మొదటి దశలో పరిశీలించడం జరుగుతుందని, సదరం సర్టిఫికెట్ల ద్వారా అనేక మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టుగా ఆరోపణలు నేపథ్యంలో తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందే వారిని తొలగించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందన్నారు. అందులో భాగంగా పరిశీలన చేపడుతున్నామన్నారు. ఇందుకోసం వైద్య బృందాలను నియమిస్తామన్నారు. సదరం ద్వారా జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించాలన్నారు. పరిశీలన కొరకు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో వివరాలను నిక్షిప్తం చేయాలన్నారు. విషయాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ట్యాంపరింగ్ వంటి వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేకంగా నియమించిన వైద్య బృందాలకు సహాయ సహకారాలు అందించడానికి సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లను నియమించాలన్నారు. వారి ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారించాలన్నారు. అనర్హులుంటే వారి వివరాలను సంబంధిత వైద్యాధికారులు తక్షణమే యాప్‌లో నమోదు చేయాలన్నారు. వైద్యుల ధ్రువీకరణతో ఇచ్చిన సర్టిఫికెట్లు సైతం రద్దు అవుతాయన్నారు. నూరు శాతం నిక్కచ్చిగా పరిశీలన, విచారణ ప్రక్రియ జరుగుతుందన్నారు. బృందాలను పర్యవేక్షించుకోవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వైద్య బృందాల పరిశీలన కొరకు సూక్ష్మ ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె. శచీదేవి, జిల్లా పంచాయతీ అధికారి ఆర్. శిరీషారాణి, జిల్లా వైద్య ఆరోగ్యఅధికారి డాక్టర్ పి. రవికుమార్, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి ఎస్. మంజులవాణి , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment