సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఓ గర్భిణి పురిటి నొప్పులతో మరణించిన వ్యవహారం నుంచి వైద్య సిబ్బందిని బయటపడేసేందుకు యత్నాలు జరుగుతున్నాయా ?.. ఈ వ్యవహారాన్ని నీరుగార్చేస్తున్నారా ?.. ఘటన జరిగి పది రోజులైనా.. విచారణ పూర్తి చేసి వారం రోజులు దాటినా.. నివేదికలో ఏముందన్న విషయం బయటకు వెల్లడించకపోవడంతో ఇవే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపిస్తుండగా.. అధికారులు మాత్రం దురదృష్టకర సంఘటనగా పేర్కొంటూ విచారణను ముగించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎస్.రాయవరం మండలం చినగమ్ములూరికి చెందిన సయ్యద్ మహాగున్నిషా అలియాస్ దేవి పురిటి నొప్పులతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో గత నెల 23న చేరింది. ఆ రోజు రాత్రి 8 గంటలకు డాక్టర్ పరీక్షించి వెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో పురిటి నొప్పులు అధికంగా వచ్చాయి. దీంతో ఆమె భరించలేక ఆపరేషన్ చేయాలని వైద్య సిబ్బందిని ప్రాధేయపడింది. అయితే వారు వైద్యులకు ఈ సమాచారాన్ని అందించకుండా మాత్రలు ఇచ్చి, పరీక్షించి వెళ్లిపోయారు. ఆ నొప్పులతోనే ఆమె కన్నుమూసింది.
ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే..
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దేవి మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విపరీతంగా నొప్పులు వస్తున్నాయని చెప్పినా ఆమెను ఐసీయూకి తీసుకెళ్లకుండా మాత్రలు ఇచ్చి వైద్య సిబ్బంది వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది చర్యలకు నిరసనగా కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్ నేతృత్వంలోని వైద్యాధికారులు గత నెల25న ఏరియాఆస్పత్రిలో విచారణనిర్వహించారు.
సెంటిమెంట్‌తో వచ్చి.. కన్నుమూసి..
దేవి మొదటి కాన్పు నర్సీపట్నం ఆస్పత్రిలో జరిగింది. తల్లీబిడ్డ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. దీంతో అదే సెంటిమెంట్‌తో మళ్లీ అక్కడికే వెళ్లింది. మొదటి సారి మంచి జరిగిందన్న నమ్మకంతో వచ్చిన ఆ గర్భి ణి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఆమె కడుపు లోఉన్న పసికందు బయటకు రాకుండానే తనువు చాలించింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలు ముకుంది. ఇదిలా ఉంటే గత ఆరునెలలుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతనెల 24న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో గర్భిణి మృతి
వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేష్ కిశోర్ నేతృత్వంలో విచారణ
వారం రోజులైనా రిపోర్టు బయటపెట్టని వైద్యాధికారులు
విచారణను నీరుగార్చేందుకే జాప్యమంటూ అనుమానాలు
Comments
Please login to add a commentAdd a comment