నీటి ఎద్దడి నివారణకు ముందస్తు కార్యాచరణ
● అనకాపల్లి జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.80 కోట్లు ● అధికారులతో సమీక్షలో జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి
ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతున్న జెడ్పీ సీఈవో నారాయణమూర్తి
సబ్బవరం: రానున్న వేసవిలో అనకాపల్లి జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.80 కోట్లు మంజూరు చేసిందని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. మండలంలోని సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం స్థానిక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జల్ జీవన్ మిషన్ పనులు, రక్షిత మంచినీటి పథకాలు, తాగునీటి బోర్ల పనితీరు, చేపడుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గత రెండేళ్లలో మండలంలో చేపట్టిన పనులపై సమీక్షించారు. పంచాయతీల్లో తాగునీటి సరఫరాపై ఆరా తీయడంతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని, ఆ మేరకు పనులు చేపడుతున్నట్లు అధికారులు ఆయనకు తెలిపారు. కార్యక్రమంలో ఏవో శివరామ ప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ జి.శివకృష్ణ, ఏఈ శ్రీనివాసరావు, పీఆర్ ఏఈ హరిణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment