పల్లెల్లో అటుకుల సవ్వడి
కొత్తపంట చేతికి రావడంతో మిల్లుల వద్ద సందడి
స్నేహబంధానికి ప్రతీకగా అటుకులు
నక్కపల్లి: సంక్రాంతి పండక్కి వచ్చిన బంధువులను,స్నేహితులను ఉత్తిచేతులతో పంపకుండా కుంచాలకొద్ది అటుకులిచ్చి గౌరవంగా పంపడం అనాదిగా వస్తున్న మన ఆచారం. బడికి వెళ్లనని పిల్లాడు మారాం చేస్తే తల్లి బుజ్జగించి జేబులో కమ్మని అటుకులు, బెల్లం వేసి పంపే అలవాటు మనది. అటుకుల పేరు చెప్పగానే పురాణాల్లో స్నేహబంధం గుర్తుకు వస్తుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని మీద ప్రేమతో పేద స్నేహితుడైన కుచేలుడు అటుకులు బహుమానంగా ఇవ్వగా, శ్రీకృష్ణుడు ఆయనకు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు. రైతులు కొత్తగా పండిన ధాన్యాన్ని తొలిపంటగా సంక్రాంతి పర్వదినాన శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. అవే ధాన్యాన్ని అటుకులుగా ఆడిస్తారు. అటుకులతో రకరకాల చిరుతిళ్లు తయారు చేస్తారు. అటుకులలో బెల్లం ముక్కలు, పాలు చక్కెర కలిపి తింటారు. పులిహోర తయారు చేస్తారు. ఈ ఏడాది వరి పంట బాగా పండింది. అడపా దడపా భారీ వర్షాలు కురిసినా, తుపాన్లు భయపెట్టినా రైతులకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. కొన్ని చోట్ల కోతలు పూర్తయ్యయి. కొన్ని ప్రాంతాల్లో వరికోతలు జరుగుతున్నాయి. కోతలు పూర్తిచేసి కుప్పలు వేసిన రైతులు పంట నూర్పులు పూర్తిచేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఈ ఏడాది 28వేల ఎకరాల్లో వరిసాగైంది. రైతుల ఇళ్లకు ధాన్యం రావడంతో అటుకుల మిల్లులు మళ్లీ తెరచుకున్నాయి. నిర్వాహకులకు పని లభించింది. పెట్టుబడులకు తగ్గట్టుగా 3 నెలలపాటు పనిచేసుకునే అవకాశం కలిగిందని మిల్లు యజమానులు చెబుతున్నారు. నక్కపల్లి, గొడిచర్ల,అడ్డురోడ్డు,పాయకరావుపేట,తుని తదితర ప్రాంతాల్లో సుమారు 15 వరకు అటుకుల మిల్లులు ఉన్నాయి.డిసెంబరు మొదలు మార్చి వరకు అటుకులు మిల్లుల వద్ద సందడి ఉంటుంది.
మిషన్‌లో అటుకులు తయారవుతున్న దృశ్యం
తయారీ
ఇలా..
డీజిల్‌తో ఈ మిల్లులు నడుస్తాయి. మట్టితో తయారు చేసిన పొయ్యిమీద 40కిలోల బరువుకలిగిన బీడు కళాయిలుఏర్పాటుచేసి ఇసుకలో ధాన్యాన్ని ఒక పర్యాయం వేయించిన తర్వాత మిల్లు ఆడితే అటుకులు తయారవుతాయి. ధాన్యాన్ని వేపడం కోసం ప్రత్యేకంగా జీడిపిక్కల ఫ్యాక్టరీల నుంచి మడ్డితెస్తారు.జీడితొక్కనుంచి నూనె తీయగా వచ్చే నల్లటి మడ్డిపదార్ధాన్ని వీరు పొయ్యిలలో వేసిమండిస్తారు. దీనిని బస్తా రూ.200లకు కొనుగోలు చేస్తారు. కృష్ణదేవి పేట నుంచి దీన్నికొని తెస్తారు. బస్తా మడ్డి 200కిలోల ధాన్యాన్ని వేపేందుకు సరిపోతుంది. మిల్లును డీజిల్‌ఇంజిన్‌సహాయంతో నడుపుతారు. ధాన్యంవేపేవారికికుంచానికి( 4కిలోలకు )రూ.8, మిల్లు ఆడే వ్యక్తికి కుంచానికి రూ.5 చెల్లిస్తారు.20లీటర్ల డీజిల్‌తో 300కుంచాల(1200కిలోల) ధాన్యం అటుకులుగా ఆడొచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇలా ధాన్యాన్ని అటుకులుగా ఆడినందుకు కుంచానికి రూ.30 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి సీజన్‌కావడంతో అటుకుల మిల్లులవద్ద సందడి కనిపిస్తోంది. గొడిచర్ల పాయకరావుపేట, శ్రీరాంపురం తదితర ప్రాంతాల్లో ఉన్న మిల్లులవద్ద చుట్టుపక్కలవారు అటుకులు ఆడించేందుకు రావడంతో నిర్వాహకులకు పనిబాగానే లభించింది. ఇలా కొత్త పంటతో ఆడించిన అటుకులను సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుళ్లు, బంధువులు, చుట్టుపక్కల స్నేహితులకు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటారు.కొంతమంది వ్యాపారులు కొత్త ధాన్యాన్ని రైతులనుంచి కొనుగోలు చేసి అటుకులు తయారు చేయించి టోకుపద్ధతిన కిరాణాషాపుల్లోను సూపర్‌మార్కెట్లలో కిలో, 2 కిలోల ప్యాకెట్ల చొప్పున విక్రయిస్తారు. కిలో అటుకులు రకాన్ని బట్టి రూ.60నుంచి రూ.90ల వరకు విక్రయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment