మాట తప్పారు.. మోసం చేశారు..
● ప్యాకేజీ చెల్లించకుండా శంకుస్థాపన ఎలా చేస్తారు ● అఖిల పక్షనేతల ఆగ్రహం ● బహిరంగ సభ ప్రాంతంలో ఆందోళన
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్ కోసం ఏపీఐఐసీ సేకరించిన భూములకు సంబంధించి రైతులకు నష్టపరిహారం, ప్రత్యేక ప్యాకేజీ చెల్లించకుండా ప్రధాని మోదీతో ఎలా శంకుస్థాపన చేయిస్తారని పలువురు అఖిలపక్ష నాయకులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని వర్చువల్‌గా తిలకించేందుకు రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ ప్రాంగణం వద్ద ఆదివారం వారు ఆందోళన చేశారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేత, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ,సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట తప్పిందన్నారు. 2014 భూసేకరణ సమయంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ప్యాకేజీ చెల్లిస్తామని మాట ఇవ్వడంతో రైతులంతా నమ్మి కోర్టు కేసులు ఉపసంహరించుకుని భూములు ఇచ్చారని చెప్పారు. ఆ సమయంలో కేవలం భూములకు నష్టపరిహారం చెల్లించారన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం చెట్లకు నష్టపరిహారం చెల్లించిందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జిరాయితీ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి నష్టపరిహా రం,నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లకు రూ.25 లక్షల ప్రత్యేక ప్యాకేజీ, ఐదు సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షలు అందజేయాల్సి ఉందన్నారు. భూములుసేకరించడం వల్ల ఉపాధి కోల్పోతున్న కల్లుగీత కార్మికులు, క్షురకులు, మత్స్యకారులు, గుల్లకార్మికులు, దళితులు, వ్యవసాయ కూలీలకు కూడా ప్యాకేజీ చెల్లించాలని కోరారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం కటాఫ్ తేదీని నష్టపరిహారం చెల్లించిన 2016 సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఇదే సంవత్సరంలో మేజర్లయిన వారికి ఈ ప్యాకేజీ చెల్లించాలన్నారు. తమ డిమాండ్లు, సమస్యలు పరిష్కరించిన తర్వాతే పనులు ప్రారంభించాలని పలు పర్యాయాలు కలెక్టర్, ఏపీఐఐసీ అధికారులు, మంత్రులకు వినతి పత్రాలు అందజేసినట్టు చెప్పారు. ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ భూముల్లో కొబ్బరి తోటలను తొలగించడం, భూములను చదును చేయడం వంటి పనులు చేస్తోందని ఆరోపించారు. అడ్డుకునే రైతులను, నాయకులను గృహనిర్బంధం చేస్తున్నారని చెప్పారు. శంకుస్థాపన చేసిన తర్వాత నైనా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే పనులు అడ్డుకుంటామని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ ఆందోళనలో జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ,ఎంపీటీసీ గంటా తిరుపతిరావు, సర్పంచ్ తళ్ల భార్గవ్,వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు సూరాకాసుల గోవిందు, సీపీఎం మండల కన్వీనర్ ఎం.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment