ఆదుకుంటాడనుకుంటే.. అసువులు బాసాడు
● జలపాతంలో మునిగి యువకుడి మృతి ● ఎన్.జి.నగరంలో తీర్థం పూట విషాదం ● ఉద్యోగంలో చేరి రెండు నెలలు కూడా గడవక ముందే మృత్యువాత ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు
దేవరాపల్లి: మండలంలోని ఎన్.గజపతినగరంలో గ్రామ దేవత తీర్థం పూట పెను విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన యువకుడు వంటాకు శ్యాంప్రసాద్ (21) పాడేరు మండలం ఐనాడ పంచాయతీ గుల్లి గిరిజన గ్రామ సమీపంలోని జలపాతంలో బుధవారం ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. గురువారం జరగాల్సిన గ్రామ దేవత తీర్థానికి దూరమయ్యారు. ఈ కుటుంబం జీవనోపాధి నిమిత్తం విశాఖలో ఉంటున్నారు. స్వగ్రామంలో ఉన్నప్పుడు ఈ కుటుంబ సభ్యులు, శ్యాంప్రసాద్ గ్రామ దేవత నారితల్లమ్మకు దీపారాధన చేసేవారు. అమ్మవారి తీర్థం కోసం మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన శ్యాంప్రసాద్ అదే రోజున మృతి చెందడాన్ని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన స్నేహితులతో కలిసి శ్యాంప్రసాద్ మంగళవారం జలపాతం సందర్శనకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జలపాతంలో మునిగి మృతి చెందాడు. శ్యాంప్రసాద్ అంత్యక్రియలు గురువారం ఎన్.జి.నగరంలో జరిగాయి.
ఉద్యోగంలో చేరి రెండు నెలలు గడవక ముందే..
డిగ్రీ చదివిన నిరుపేద కుటుంబానికి చెందిన శ్యాంప్రసాద్ రెండు నెలల క్రితమే ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు.
విశాఖలోని పట్టాభిరామ్ గార్డెన్స్‌లో నివాసం ఉంటున్న ఇతని తండ్రి శ్రీధర్ జీవీఎంసీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. భర్తతో పాటు కుమారుడి జీతం కూడా కలిసి వస్తుందని, ఇక తమ కష్టాలు తీరుతాయని శ్రీధర్ భార్య లక్ష్మి ఎంతో ఆనందించింది.
ఉద్యోగంలో చేరి రెండు నెలలు కూడా గడవక ముందే కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు పలువురి కంటతడి పెట్టించింది.
కన్నీటిపర్యంతమైన తండ్రి..
ఎన్.గజపతినగరం గ్రామానికి చెందిన శ్రీధర్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో దివ్యాంగుడైన ఓ కొడుకు ఇటీవలే మృతి చెందాడు. ఆ బాధ నుండి ఇంకా తేరుకోక ముందే ఎదిగి వచ్చిన కొడుకు జలపాతంలో మునిగి చనిపోవడంతో గుండెలు పగిలేలా రోదించిన తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కొడుకులు ఇద్దరు మృతి చెందారని, తాము ఎవరి కోసం బ్రతకాలని, కన్న కొడుకు చితికి తలకొరివి పెడతానని కలలో కూడా ఊహించలేదని, ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment