చిత్తశుద్ధితో రహదారి భద్రతా చర్యలు
తుమ్మపాల : జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పకడ్బందీగా, చిత్తశుద్ధితో నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై రవాణా, పోలీసు శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించి మాసోత్సవాలు– 2025 పోస్టర్లను, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు చాలా ముఖ్యమైనవన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సురక్షిత డ్రైవింగ్‌పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. రహదారి భద్రత కార్యక్రమాలు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా చేపట్టాలన్నారు. ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శుక్రవారం నుంచి రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, డ్రైవింగ్ స్కూల్ ఇన్‌స్పెక్టర్స్, రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందితో వలంటీర్లను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాలన్నారు.
రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్
ఈనెల 18 నుంచి 21వ వరకు మద్యం సేవించి వాహనం నడిపే వారిని గుర్తించడం, అధిక వేగంతో నడిపే వాహనాలను స్పీడ్ గన్‌తో గుర్తించడం, హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి వాటిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని జేసీ తెలిపారు. ఈనెల 22 నుంచి 23వ వరకు జాతీయ, రాష్ట్ర రహదారులలో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసి అక్కడ తగిన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.
అవగాహన కార్యక్రమాలు
ఈనెల 24న డ్రైవర్లకు హెల్త్ చెకప్ చేయించడం, 25న అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, 26, 27 తేదీలలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి వాకథాన్‌లు నిర్వహించడం, 30, 31వ తేదీలలో బైక్ ర్యాలీలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని జేసీ తెలిపారు. కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి జి. మనోహర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ ఎం.వెంకట నారాయణ, మోటార్ వెహికల్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, రవాణా, పోలీస్, శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు జేసీ జాహ్నవి ఆదేశం
జాతీయ భద్రతా మాసోత్సవాలు ప్రారంభం
పోస్టర్, కరపత్రాలను విడుదల చేసి జేసీ
Comments
Please login to add a commentAdd a comment