సాంకేతికతతో ముందడుగు
విశాఖ లీగల్: శరవేగంతో విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం న్యాయవ్యవస్థలో కూడా అభివృద్ధి చెందాలని కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ అన్నారు. శనివారం మధ్యాహ్నం బీచ్‌రోడ్డులోని ఆంధ్ర విశ్వకళా పరిషత్ కన్వెన్షన్ సెంటర్లో జాతీయ, ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన సౌత్ జోన్–2 సదస్సులో న్యాయస్థానాల్లో వాజ్యాల జాబితా అన్వేషణ, మినహాయింపు అన్న అంశంపై న్యాయ నిపుణులు ప్రసంగించారు. ఏడు రాష్ట్రాలకు చెందిన హైకోర్టు, జిల్లా కోర్టు, ఇతర కోర్టుల న్యాయమూర్తులు సదస్సుకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి 25 మందికి పైగా న్యాయకోవిదులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక తీరు తెన్నులు–భవిష్యత్తులో మార్పులపై కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్ ప్రసంగించారు. డిజిటల్ సాంకేతికత న్యాయవ్యవస్థతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉందన్నారు. నేడు ప్రతి రంగంలోనూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన నేపథ్యంలో న్యాయస్థానాల్లో కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికత చూపించాలని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా న్యాయవాదులు, న్యాయమూర్తులు సిబ్బంది తమ నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. సోషల్ మీడియా –సాధారణ మీడియాపై మధ్య సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఇటీవల కాలంలో ఈ మీడియాల వల్ల వస్తున్న సమస్యలను విశదీకరించారు. డిజిటల్ సంతకాలు నైపుణ్యం కలిగిన న్యాయవాదులు, న్యాయమూర్తులు రేపటి భవితకు మార్గదర్శకులుగా నిలుస్తారన్నారు. 2015 నాటికి సాంకేతికపరమైన అంశాలకు సంబంధించి ఓ పుస్తకంలో అంశాలను ఆమె వివరించారు.
న్యాయ స్థానాల్లో జవాబుదారీతనం కీలకం
న్యాయస్థానాల్లో జవాబుదారీతనం చాలా కీలకమైందని కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి, ఈ కోర్టుల పర్యవేక్షకులు జస్టిస్ సీఎం జోషి పేర్కొన్నారు. సాంకేతికత పేరుతో ముందుకెళుతున్న న్యాయస్థానాలు అంతర్గత మార్పులకు ముందడుగు వేయాలన్నారు. చలానా, ఫైన్ కేసులు సైతం విపరీతమైన జాప్యానికి ఎవరు కారణమనేది ప్రశ్నించుకోవాలన్నారు. కేసులకు సంబంధించి ప్రత్యామ్నాయ పరిష్కార వివాద యంత్రాంగ సేవలను పొందాలని కూడా సూచించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవాలని సూ చించారు. ఇటీవల కేరళ హైకోర్టు పర్యవేక్షణలో జరిగిన ఈ కోర్టుల విధానాన్ని వివరించారు. వర్చువల్ విధానంలో కేసులు విచారణకు కేరళ హైకోర్టు తీసుకున్న చర్యలను జస్టిస్ సీఎం జోషి వెల్లడించారు. 30 మంది హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ జూనియర్ సివిల్ జడ్జీలు, మేజిస్ట్రేట్లు, ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ హరినాథశర్మ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్
సౌత్ జోన్–2 సదస్సు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment