గొట్టివాడ ఇసుక రీచ్‌లో తవ్వకాలు నిలిపివేత
గొట్టివాడ ఇసుక రీచ్‌లో తహసీల్దారు తిరుమలబాబు
కోటవురట్ల: ‘వరాహనదిలో ఇసుక తోడేళ్లు’ శీర్షికన సాక్షి దినపత్రికలో ఈ నెల 7వ తేదీన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు శాఖాధికారులు సంయుక్తంగా ఈ నెల 12న గొట్టివాడ ఇసుక రీచ్‌ను పరిశీలించారు. ఇందుకు సంబంధించి తహసీల్దారు తిరుమలబాబు వివరణ ఇచ్చారు. గొట్టివాడ ఇసుక రీచ్‌ను పరిశీలించిన రోజున ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో ఒక ట్రాక్టరుకు రూ.5 వేలు అపరాధ రుసుం చెల్లించగా మిగిలిన 3 ట్రాక్టర్లు పోలీసు స్టేషన్‌లో ఉంచామని తెలిపారు. కాగా గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీలో భాగంగా గొట్టివాడ, పందూరు ఇసుక రీచ్‌లలో ఇసుక లభ్యత ఎక్కువగా ఉన్నందున తవ్వకాలకు అనుమతి ఇచ్చామన్నారు. తాజాగా ఈనెల 16న మరోసారి పరిశీలించగా గొట్టివాడ ఇసుక రీచ్‌లో ఇసుక లభ్యత లేకపోవడంతో ఎటువంటి ప్రభుత్వ అవసరాలకు గాని, వ్యక్తిగత అవసరాలకు గాని ఇసుకను తీయడానికి వీలులేకుండా అనుమతులు రద్దు చేసినట్టు తెలిపారు. ఇసుక ఉచిత విధానంలో ప్రభుత్వ అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాల కోసం దరఖాస్తు చేసిన వారికి మాత్రమే అర్హత ప్రకారం అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ, గ్రామ రెవెన్యూ సహాయకులు ఇసుక రీచ్‌ల వద్ద విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment