ప్రొటోకాల్ రగడ
మహారాణిపేట (విశాఖ): ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభ కార్యక్రమాలు, శంకుస్థాపనలకు తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే కాకుండా ఎలాంటి ఆహ్వానాలు అందడం లేదని పలువురు జెడ్పీటీసీలు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఉమ్మడి విశాఖ జెడ్పీ చైరపర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశంలో ప్రొటోకాల్‌పై వాడీవేడిగా చర్చ జరిగింది. ఇటీవల అనంతగిరి మండలంలో రోడ్డు శంకుస్థాపన సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యునిగా తనకు ఎలాంటి ఆహ్వానం లేదని, ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమా అని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నిలదీశారు. కొంతమంది అధికారులు టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలు కప్పుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఇలా వారి జెండాలను మోస్తూ ప్రజలతో ఎన్నుకోబడిన తన లాంటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్నామని ధ్వజమెత్తారు. ప్రజలతో ఎన్నుకున్న ఎమ్మెల్యేలను కాదని కూటమి నాయకులతో పనులు ప్రారంభించడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి మాట్లాడుతూ ఈ రోడ్డు శంకుస్థాపనకు స్థానిక ఎంపీపీ అయిన తనకు ఆహ్వానం అందలేదన్నారు. కొంతమంది అధికారుల తీరు సరిగ్గా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం మారగానే కొంత మంది అధికారుల తీరులో కూడా మార్పు కనబడుతోందన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉందన్నారు. కాని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు చెప్పిన ప్రకారం అధికారులు పనిచేయడం సరికాదన్నారు. గ్రామసభ తీర్మానబ ప్రకారం పనులు చేయాలని, అలాగే మండలపరిషత్, జిల్లాపరిషత్‌లో ఆమోదం ప్రకారం పనులు చేయాల్సి ఉందన్నారు. కాని ఇక్కడ ఎలాంటి తీర్మానాలు లేకుండా పనులు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రొటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొలుగొండ జెడ్పీటీసీ గిరిబాబు మాట్లాడుతూ కొంత మంది అధికారులు నిబంధనల ప్రకారం పనిచేయకపోవడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కక్షసాధింపు అన్యాయం
పింఛనుదారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అన్యాయమని గొలుగొండ జెడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు అన్నారు. వారిని ఇబ్బందులు పెట్టేలా సర్వేలు, సదరం సర్టిఫికెట్ల పరిశీలనకు కూటమి ప్రభుత్వం పూనుకోవడం, దీనికి అధికారులు వంతపాడుతున్నారన్నారు. అధికార పార్టీకి ఇలాంటి చర్యలు సరికాదని పలువురు జెడ్పీటీసీలు ఆందోళన వ్యక్తం చేశారు.
బల్క్ డ్రగ్ వద్దు
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద బల్క్ డ్రగ్ ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురు అవడమే కాకుండా మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు ఆవేదన వ్యక్తంచేశారు.బల్క్ డ్రగ్ ఏర్పాటును విరమించాలని కోరుతూ జెడ్పీ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందజేశారు.
అంకిత భావంతో పనిచేయాలి:జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర
ప్రజా సమస్యలపై అంకిత భావంతో పనిచేయాలని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధికారులను ఆదేశించారు. ఆమె అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘ సమావేశాలు, జెడ్పీ సర్వసభ్య సమావేశంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్థిక ప్రణాళికలు, తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జట్, వ్యయాలను సభ్యుల ఆమోదంకోసం ప్రవేశపెట్టామన్నారు. జెడ్పీకి సంబంధించి భవనాలు, అతిధి గృహాలు, దుకాణాలు, స్థలాల అభివృద్ధిపై సూచనలు, సలహాలు సభ్యుల నుంచి కోరారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు సభ్యులను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు. జెడ్పీ సీఈవో నారాయణమూర్తి మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో జెడ్పీకి సంబంధించి 19 అతిథి గృహాలు ఉన్నాయని, వీటిలో కొన్నింటికి మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తెస్తామన్నారు. నిర్వహణకు ఇబ్బందులు లేఉండా నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆదాయ వనరులు పెంచుకునేలా సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.
అంచనా బడ్జెట్‌కు ఆమోదం
అనంతరం 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరణ బడ్జెట్, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా ఆదాయం రూ.1589కోట్ల 13లక్షల 81వేల 635, అంచనా వ్యయం రూ.1586కోట్ల 08లక్షల, 58వేల 235కు సంబంధించి సభ్యులు ఆమోదం తెలిపారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీడీ విజయకుమార్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ధ్వజం
మద్దతు తెలిపిన పలువురు జెడ్పీటీసీలు
కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం
నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటాం: జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర హెచ్చరిక
వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం
Comments
Please login to add a commentAdd a comment