పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యత
మాడుగుల: పరిసరాలను పరిశుభ్రత సామాజిక బాధ్యత అని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అన్నారు. శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో కొంకి అప్పారావు ఆధ్వర్యంలో ప్రారంభించిన స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, బస్టాండ్‌లు, ఇతర స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం స్వచ్ఛత పాటిస్తామని, మండల స్థాయి అధికారులు, పంచాయతీ సిబ్బందితో పాటు, ప్రజా ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. సంత ప్రాంతం, బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకటరాజారామ్, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడోవో కొంకి అప్పారావు, సర్పంచ్ ఎడ్ల కళావతి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయం వద్ద..
అనకాపల్లి: పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రతిజ్ఞచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ బి.అప్పారావు, సీఐ టి.లక్ష్మి, ఎస్‌ఐలు రమణయ్య, వెంకన్న, ఆదినారా యణ, కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ...
తుమ్మపాల: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని, ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని డీఆర్వో వై.సత్యనారాయణరావు తెలిపారు. స్వచ్ఛాంధ – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆయనతో పాటు పలు శాఖల జిల్లా అధికారులు శనివారం కలెక్టరేట్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడవ శనివారం కార్యాలయాలు, పాఠశాలలు, ఆస్పత్రుల్లో పట్టణాలు, పల్లెల్లో ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏడాది పాటు నిరంతరాయంగా కొనసాగనున్న కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణఅభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు.. మిగిలిన శాఖల సమన్వయంతో ప్రధాన భూమిక పోషించాలని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో మానవహారాన్ని నిర్వహించి, ప్రతిజ్ఞలు చేయించాలన్నారు. అంతకు ముందు జిల్లా అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యాలయ ప్రాంగణం, పరిసరప్రాంతాలలో గల తుప్పలు, పొదలు తొలగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి జి.రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో...
అనకాపల్లి: స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో డీఎంహెచ్‌వో పడాల రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా ఒక్కో థీమ్‌తో కార్యక్రమాలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ నెల న్యూ ఇయర్–క్లీన్ స్టార్ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చెప్పారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
జాయింట్ కలెక్టర్ జాహ్నవి
కలెక్టరేట్ పరిసరాలను శుభ్రం చేస్తున్న డీఆర్వో సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment