చోడవరం: గోవాడ చక్కెర కర్మాగారం కార్మికులు ఎట్టకేలకు సమ్మె విరమించారు. జీతభత్యాల బకాయిలు చెల్లించాలంటూ వారం రోజులుగా నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీ ఎండీ సన్యాసినాయుడు, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు కార్మికులతో పలుమార్లు చర్చలు జరిపి.. ఎట్టకేలకు వారం రోజుల్లో కొంతమేర చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దాంతో కార్మికులు సమ్మెను విరమించి శనివారం నుంచి విధులకు హాజరయ్యారు. ఈనెల 16వ తేదీ నుంచి జరగాల్సిన రెగ్యులర్ క్రషింగ్‌కు కార్మికుల సమ్మె కారణంగా కొంత అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు సమ్మె విరమించడంతో క్రషింగ్ ప్రారంభించేందుకు యాజమాన్యం అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే రైతులకు కటింగ్ పర్మిట్లు ఇచ్చేయడంతో వారు కూడా చెరకును ఫ్యాక్టరీకి సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో రెండ్రోజుల్లో రెగ్యులర్ క్రషింగ్ ప్రారంభించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా నిరవధికంగా క్రషింగ్ చేసి సీజన్‌ను ముగించే విధంగా యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇదిలావుండగా ఫ్యాక్టరీకి ఏపీ ట్రాన్స్‌కో నుంచి, విశాఖ డెయిరీ నుంచి రావలసిన సుమారు రూ.7 కోట్లు వసూలు చేయగలిగితే సమస్యలన్నీ తీరిపోతాయని, స్థానిక ఎమ్మెల్యే దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు, కార్మికులు అంటున్నారు.
రెండు రోజుల్లో రెగ్యులర్ క్రషింగ్ ప్రారంభమయ్యే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment