జన జాతర
● అంబరాన్ని తాకిన అమ్మవారి సంబరం ● కిక్కిరిసిపోయిన యలమంచిలి పుర వీధులు ● లక్ష మందికిపైగా తరలివచ్చిన భక్తజనం
యలమంచిలి రూరల్: భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి.. కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా యలమంచిలి భక్తజన సంద్రంగా మారింది. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు.. ఎంతసేపు చూసినా తనివితీరని సాంస్కృతిక ప్రదర్శనలు.. ప్రత్యేక ఆకర్షణగా ప్రఖ్యాత డాన్సర్ల నృత్యప్రదర్శనలు.. వెరసి ధర్మవరంలో కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం అంబరాన్ని తాకింది. యలమంచిలి పట్టణంలోని ప్రధాన రహదారి సహా అంతర్గత రహదారులన్నీ జనంతో కిటకిటలాడాయి. పట్టణంలోని ధర్మవరంలో మార్గశిర మాసం నెల రోజులపాటు కనక మహాలక్ష్మి
అమ్మవారికి పూజలు చేశారు. మార్గశిరం పూర్తయిన తదుపరి సంక్రాంతి తరువాత అమ్మవారి నెల రోజుల పండుగను చేయడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం అమ్మవారి నెల రోజుల పండుగ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఇసుకవేస్తే రాలనంత జనం జాతర మహోత్సవాన్ని చూసేందుకు తరలివచ్చారు. స్టేజీ ప్రోగ్రాంలు, డీజే శబ్దాలతో పట్టణం హోరెత్తిపోయింది. బుర్రకథ, మిమిక్రీ, సినీనటుల అనుకరణ నవ్వులు పూయించాయి. పలు గ్రామాల నుంచి వచ్చిన మహిళల కోలాట బృందాలు, భజనలు, తప్పెటగుళ్లు ఆకట్టుకున్నాయి. యలమంచిలి సీఐ ధనుంజయరావు నేతృత్వంలో 8 మంది ఎస్సైలు, సుమారు 100 మంది పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తును పకడ్బందీగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment