న్యాయం చేయకుంటే నిర్వాసితులతో కలిసి పోరాటం
● పరిహారం చెల్లించాకే పనులు మొదలుపెట్టాలి ● వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతలు వీసం, అప్పలరాజు డిమాండ్
నక్కపల్లి: ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన రైతులు, నిర్వాసితులతో చర్చలు జరిపి వారి పెండింగ్ సమస్యలు పరిష్కరించకుండా బల్క్ డ్రగ్ పార్క్ పనులు చేపట్టడం తగదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, కాపు కార్పొరేషన్ మాజీ డైరక్టర్ వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజులు ఆరోపించారు. ఆదివారం వారు రాజయ్యపేట, చందనాడ గ్రామాల్లో పర్యటించి బల్క్ డ్రగ్ పార్క్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించలేదని, డీ ఫారం, సాగు భూములకు పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించకుండా భూములను స్వాధీనం చేసుకుని యంత్రాలతో పనులు చేస్తున్నారని మొర పెట్టుకున్నారు. దీనిపై రామకృష్ణ, అప్పలరాజులు మాట్లాడుతూ నష్టపరిహారం కోసం నిర్వాసితులు, రైతులు ఒకపక్క పోరాటం చేస్తుంటే ఏకపక్షంగా పోలీసుల సాయంతో నిర్వాసితుల భూముల్లో పనులు మొదలు పెట్టడం తగదన్నారు. ఈ పనులు తాత్కాలికంగా నిలుపుదల చేసి రైతులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఓట్ల కోసం రైతులకు చేతకాని హామీలు ఇచ్చిన అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారన్నారు. పరిస్థితి చేయి దాటకముందే నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేసి న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే త్వరలో రైతులు, నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేసి పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎంపీటీసీ గంటా తిరుపతిరావు, సర్పంచ్ తళ్ల భార్గవ్, సీపీఎం మండల కన్వీనర్ మన బాల రాజేష్, రైతులు దారబాబు, రాజేష్, నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment