నల్లమాడ: బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కన్నబిడ్డలిద్దరూ ఒకేసారి మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కురుమాల గ్రామానికి చెందిన చాకలి సంగాల లలితమ్మ, చెన్నకేశవులు దంపతులకు ప్రదీప్, హర్షవర్ధన్, దిలీప్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో ఐటీఐ పూర్తి చేసిన పెద్ద కుమారుడు ప్రదీప్ (25), మూడో కుమారుడు దిలీప్ (23) తొమ్మిదేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉన్నారు.
ప్రదీప్‌కు మూడేళ్ల క్రితం నల్లమాడ మండలం పాతబత్తలపల్లికి చెందిన లక్ష్మితో వివాహమైంది. దిలీప్ అవివాహితుడు. అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటూ విధులకు వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 6.30 గంటలకు అన్నదమ్ములిద్దరూ ఒకే ద్విచక్ర వాహనంపై విధులకు వెళుతుండగా మార్గమధ్యంలో ఓ ట్రక్కు ఢీకొంది. తలపై చక్రం వెళ్లడంతో ప్రదీప్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దిలీప్‌ను స్థానికులు నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స అందేలోపు ప్రాణాలు కోల్పోయాడు.
విషయం తెలియగానే కురుమాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంత ఘోరం జరిగిపోయిందో అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన బెంగళూరుకు తరలివెళ్లారు. బాధిత కుటుంబసభ్యులకు ఆస్థనిక వైఎస్సార్‌సీపీ నేత కె.రాజారెడ్డి అండగా నిలిచారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గురువారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
Comments
Please login to add a commentAdd a comment