సరైన భద్రత లేక భయం భయం | - | Sakshi
Sakshi News home page

సరైన భద్రత లేక భయం భయం

Published Fri, Aug 23 2024 3:28 AM | Last Updated on Fri, Aug 23 2024 12:47 PM

No Headline

అక్యూట్‌ మెడికల్‌ కేర్‌లో రోగులకు సేవలందిస్తున్న పీజీ వైద్య విద్యార్థులు, నర్సులు

రెండు నెలల క్రితం సర్వజనాస్పత్రిలో విధుల్లో ఉన్న సీఎంఓ, పీజీలతో రూరల్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. వైద్యులను దుర్భాషలాడాడు. సకాలంలో ఎందుకు వైద్యం అందించరంటూ వైద్యులతో గొడవకు దిగాడు. మెడ తిప్పేస్తానంటూ ఓ వైద్యురాలిని హెచ్చరించాడు. సర్వజనాస్పత్రిలో విధులు నిర్వర్తించే వైద్యుల భద్రత ఎంత ఘోరంగా ఉందో తెలిపే ఘటనిలివీ.

అనంతపురం నగరానికి చెందిన ఓ యువకుడు తలకు దెబ్బ తగిలిందంటూ ఇటీవల మద్యం మత్తులో సర్వజనాస్పత్రి క్యాజువాలిటీకి వచ్చాడు. వైద్యులు స్పందించి చికిత్స అందించే లోపే ఆలస్యం చేస్తారా అంటూ సీఎంఓ, పీజీ వైద్యులు, స్టాఫ్‌నర్సులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే టూటౌన్‌ పోలీసులకు ఫోన్‌ చేయగా పోలీసులు వచ్చి అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అనంతపురం మెడికల్‌: కోల్‌కతాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవల చోటుచేసుకున్న ఓ వైద్య విద్యార్థి హత్యాచార ఘటన యావత్‌ దేశాన్నీ కదిలించింది. ఏకంగా సుప్రీంకోర్టు ఈ కేసును స్వయంగా స్వీకరించి విచారణ చేపట్టడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో వైద్య విద్యా ర్థులు, మహిళా వైద్యులు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారనే విషయం చర్చనీయాంశమైంది. అనంతపురంలోని సర్వజనాస్పత్రిలోనూ వైద్య విద్యార్థులు, మహిళా వైద్యులు, స్టాఫ్‌నర్సులు భయం గుప్పిట్లో వైద్యం అందిస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు.

కానరాని భద్రత..
వైద్యో నారాయణో హరీ అని వైద్యున్ని దేవునితో పోల్చుతాం. అలాంటి వైద్యులకు అనంతపురం సర్వజనాస్పత్రిలో భద్రత లేకుండా పోయింది. సీసీ కెమెరాలు సరిగా పని చేయకపోవడంతో అర్ధరాత్రి వేళ కొందరు తప్పతాగి వైద్యం పేరుతో ఎమర్జెన్సీ వార్డులోకి చొరబడుతున్నారు. ఈ క్రమంలో సిబ్బందితో గొడవకు దిగడం సర్వసాధారణంగా మారింది. పోలీసుల స్పందన కరువవడంతో పోస్టు గ్రాడ్యుయేషన్‌ వైద్య విద్యార్థులు, మహిళా వైద్యులు, స్టాఫ్‌ నర్సులు భయంతోనే విధులు నిర్వర్తిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది 107 మంది ఉన్నా చాలడం లేదు.

కనీస సౌకర్యాలు నిల్‌..
బోధనాస్పత్రిలో 20 విభాగాల్లో 351 మంది పీజీ విద్యార్థులు రోగులకు సేవందిస్తున్నారు. రాత్రి వేళ మెడిసిన్‌, సర్జరీ, గైనిక్‌, ఆర్థో, ఈఎన్‌టీ, అనస్తీషియా తదితర విభాగాల్లో 30 మందిపైగా ఉంటారు. నైట్‌ డ్యూటీ విధుల్లో 36 గంటల పాటు నిర్విరామంగా పని చేయాల్సి ఉంటుంది. రోగుల ప్రాణాలు కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న అలాంటి వారికి కనీస ప్రమాణాలైన తాగునీరు, బాత్‌రూంలు, రెస్ట్‌ రూంలు కూడా కరువయ్యాయి. మూత్ర విసర్జనకు క్వార్టర్స్‌కు పరుగులు తీయాల్సి వస్తోంది. పీజీ క్వార్టర్స్‌ పరిసరాల్లో కేవలం ఒక్క సీసీ కెమెరా మాత్రమే ఉంది. రాత్రిళ్లలో వీధి లైట్లు పనిచేయడం లేదు. దీన్ని బట్టి ఎంత అధ్వాన పరిస్థితుల్లో పీజీ విద్యార్థులు, మహిళా వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక.. క్వార్టర్స్‌లో పీజీ విద్యార్థులకు సరిపడా గదులు లేక చాలా మంది బయటకు అద్దెకు ఉంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement