పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు
రాప్తాడురూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనంతపురం రూరల్ మండలం కొడిమి, ఆలమూరు జగనన్న కాలనీలపై కొందరు తమ్ముళ్లు కన్నేశారు. ఇంటి నిర్మాణాల కోసం ఉంచిన మెటీరియల్‌ను యథేచ్ఛగా ఎత్తుకెళ్తున్నారు. ప్రభుత్వ మెటీరియల్ తెలిసినా అధికారమే అండగా ట్రాక్టర్లు, లగేజీ వాహనాలు పెట్టి మరీ తరలించారు. ఆయా లేఔట్లలో ఇళ్ల నిర్మాణాల కోసం డంప్ చేసిన ఇసుక, సిమెంట్, ఐరన్, సిమెంట్ పెల్లలను విచ్చలవిడగా తరలించారు. కొందరైతే గుజరీలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అప్రమత్తమైన అధికారులు వాచ్‌మెన్లను ఏర్పాటు చేశారు. వీరుకూడా స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు సూచించిన వారే కావడంతో వాచ్‌మెన్లు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎవరెవెరు ఎత్తుకెళ్తున్నారో ఈ వాచ్‌మెన్లకు తెలుసని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు.
పట్టపగలే ట్రాక్టర్లలో తరలింపు..
ఇన్ని రోజులు రాత్రిపూట, తెల్లవారుజామున మెటీరియల్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు... ఇప్పుడు పట్టపగలే బరి తెగిస్తున్నారు. కొడిమి జగనన్న లేఔట్ నుంచి ఇసుక, కడ్డీలు, సిమెంట్ పెల్లలు, సిమెంట్, చివరకు కార్మికులు పనిమీద వినియోగించుకునే ఇనుప కుర్చీలు, రేకులు (షీట్లు) ఎత్తుకెళ్తున్నారు. నరసనాయనికుంట, కొడిమి, రాచానపల్లికి చెందిన వారే ఎక్కువగా ఈ మెటీరియల్‌ను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. కొందరు ఇళ్ల వద్ద, తోటల్లో డంప్ చేసుకున్నట్లు సమాచారం. మరికొందరు షెడ్ల నిర్మాణాలకు అవసరమైన మొత్తం మెటీరియల్ ఇక్కడి నుంచి తరలించారు. లేఔట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఓ తోటలో కొడిమికి చెందిన వ్యక్తి షెడ్డు నిర్మాణానికి ఇక్కడి నుంచి ఇసుక, పెల్లలు, కడ్డీలు తరలించినట్లు చెబుతున్నారు.
బలికానున్న హౌసింగ్ ఉద్యోగులు..
మెటీరియల్ పెద్ద ఎత్తున తరలిపోవడంతో హౌసింగ్ ఉద్యోగులు బలికానున్నారు. పనులు నిలబట్టే రోజుకు లేఔట్లలో ఏయే మెటీరియల్ ఎంతెంత ఉందో రికార్డు చేశారు. ఇదంతా సంబంధిత హౌసింగ్ ఏఈ ధ్రువకరించి సంతకం చేసి ఉంటారు. మెటీరియల్ వివరాలను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేశారు. జగనన్న లేఔట్లలోని మెటీరియల్‌పై విజిలెన్స్ విచారణ సాగుతోంది. మరో 10–15 రోజుల్లో కొడిమి, ఆలమూరు లేఔట్లలోనూ ఈ విచారణ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో ఉన్న స్టాక్, ఫిజికల్‌గా ఉన్న స్టాక్‌కు కచ్చితంగా వ్యత్యాసం వస్తుంది. అలావస్తే తమ ఉద్యోగులు బలవుతారని హౌసింగ్ అధికారి ఒకరు వాపోయారు.
హౌసింగ్ ఏఈ రాజేష్
ఏమంటున్నారంటే....
కొడిమి జగనన్న లేఔట్ నుంచి మెటీరియల్ ఎత్తుకెళ్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ట్రాక్టర్లలో తరలించినట్లు గుర్తించాం. స్టాక్‌లో తేడా వస్తే తాము ఇబ్బందులు పడతాం. తాటిచెర్ల లేఔట్ పనులు జరుగుతున్నాయి. రెండుమూడు రోజుల్లో టిప్పర్ల ద్వారా మెటీరియల్‌ను అక్కడికి తరలిస్తాం. ఇప్పటికే ఎత్తుకెళ్లిన మెటీరియల్‌పై పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. నిందితుల నుంచి రికవరీ చేయించి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం.
కొడిమి జగనన్న లేఔట్‌లో ఇళ్ల నిర్మాణ మెటీరియల్ ఎత్తుకెళ్తున్న వైనం
ఇప్పటికే లక్షలాది రూపాయల
సరుకు మాయం
మెటీరియల్ తరలింపు వెనుక
‘తమ్ముళ్ల ’ హస్తం
Comments
Please login to add a commentAdd a comment