మందకొడిగా పంటల బీమా ప్రీమియం చెల్లింపు
● నేటితో ముగియనున్న గడువు
అనంతపురం అగ్రికల్చర్: రబీకి సంబంధించి పంటల బీమా పథకం కింద గుర్తించిన పంటలకు రైతులు తమ వాటా ప్రీమియం చెల్లించడానికి సమయం దగ్గర పడింది. వరికి మినహా మిగతా పంటలకు ఆదివారంతో గడువు ముగియనుంది. వాతావరణ, ఫసల్ బీమా కింద పప్పుశనగ, వేరుశనగ, పప్పుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి, టమాట, మామిడి పంటలకు బీమా వర్తింపజేశారు. ఇందులో వ్యవసాయ పంటలకు రైతులు తమ వాటా కింద 1.5 శాతం, అలాగే మామిడి, టమాట వంటి ఉద్యాన పంటలకు 5 శాతం మేర ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే పప్పుశనగ రైతులు ఎకరాకు 450, వేరుశనగకు రూ.480, జొన్నకు రూ.315, మొక్కజొన్నకు రూ.525, వరికి రూ.630, టమాటకు రూ.1,600, మామిడికి రూ.1,650 ప్రకారం ప్రీమియం చెల్లించాలి. ఇందులో వరికి ప్రీమియం చెల్లింపు గడువు నెలాఖరు వరకు ఉంది. మిగతా అన్ని పంటలకు ఈ నెల 15వ తేదీ (ఆదివారం)తో గడువు ముగియనుంది. అయితే ఇప్పటికీ 40 శాతం మంది కూడా ప్రీమియం చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పంటలకూ ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించాలని ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.
క్రమశిక్షణతో మెలగాలి
● ఘర్షణలో పాల్గొన్న 8 మంది విద్యార్థులు హాస్టల్ నుంచి సస్పెన్షన్
● హాస్టల్‌ను సందర్శించిన ఇన్‌చార్జ్ వీసీ
అనంతపురం: విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత సూచించారు. ఎస్కేయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడు, నాలుగో సంవత్సరం చదువుతూ తుంగభద్ర హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల మధ్య గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. శనివారం ఉదయం హాస్టల్‌ను సందర్శించిన ఇన్‌చార్జ్ వీసీ ఇంజినీరింగ్ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఘర్షణకు పాల్పడిన ఎనిమిది మంది విద్యార్థులను తల్లిదండ్రుల సమక్షంలోనే మందలించారు. కష్టపడి చదివిస్తుంటే మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు. క్రమశిక్షణతో మెలగకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఇన్‌చార్జ్ వీసీ భోజనం చేశారు. మరోవైపు ఇటుకలపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్ సైతం 8 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సదరు విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించిన వాచ్‌మెన్‌లు ఉజ్జినయ్య, నాగరాజు, మెయిన్ గేట్ వద్ద ఉన్న రామ్మోహన్ రెడ్డి, సూర్యనారాయణ, బాలరాజుకు మెమో జారీ చేశారు. ఇన్‌చార్జ్ వీసీ వెంట ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment