‘సాగునీటి’ ఎన్నికల్లో ‘అధికార’ పెత్తనం
అనంతపురం సెంట్రల్/శింగనమల/యల్లనూరు: జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు శనివారం ఏకపక్షంగా సాగాయి. అధికార టీడీపీ నేతలు పెత్తనం చెలాయించారు. అన్ని స్థానాల్లో తామే గెలవాలన్న ఉద్దేశంతో అప్రజాస్వామిక విధానాలకు తెర తీశారు. ఇతరులెవరూ ఎన్నికల్లో పోటీపడకుండా దౌర్జన్యాలకు దిగారు. అధికారులు, పోలీసులు కూడా వారికి సహకరించారు. నామినేషన్ సైతం వేయకుండా అడ్డగించి.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలిపారు. టీడీపీ నేతలు, అధికారుల తీరుకు నిరసనగా చాలాచోట్ల ఎన్నికలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు బహిష్కరించారు. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ప్రాజెక్ట్ కింద అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మొత్తం 54 నీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 648 మంది సభ్యులను ఎన్నుకున్నారు. అలాగే చిన్ననీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో 89 నీటి సంఘాలకు ఎన్నికలు జరగ్గా.. రెండు వాయిదా పడ్డాయి. బెళుగుప్ప మండలం శీర్పి, కూడేరు మండలం రామచంద్రాపురం (పొట్టి చెరువు) నీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. భైరవానితిప్ప ప్రాజెక్ట్ (బీటీపీ) కమిటీ ఎన్నిక కూడా పూర్తయిందన్నారు. త్వరలోనే జిల్లా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు.
శింగనమలలో టీడీపీ దౌర్జన్యం..
శింగనమల రంగరాయల చెరువు సాగు నీటి సంఘం ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఇండిపెండెంట్ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా, ఓటు కోసం వచ్చిన రైతులను బలవంతంగా బయటకు పంపించారు. ఆరు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ 500 దాకా ఓటర్లు ఉన్నారు. అందులో దాదాపు 200 మంది పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. వీరిలో ఎక్కువమంది ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన సాగునీటి పారుదల సంఘం మాజీ అధ్యక్షుడు నూర్ మహమ్మద్‌కు మద్దతుగా ఉన్నారు. అతనితోపాటు అతని అనుచరులు నామినేషన్లు వేయడానికి సిద్ధమవగా.. రైతుల మద్దతు లేని టీడీపీ నాయకులు లోనికి చొచ్చుకొచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు తీసుకోరాదంటూ పోలింగ్ అధికారులతో గొడవ పెట్టుకున్నారు. ‘మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము చెప్పిన వారే ఎన్నికవుతారు. ఓట్లు ఏమీ లేవు. రైతులందరూ బయటకు పోవాలి’ అంటూ రైతులను బయటకు పంపించేశారు. గంట తరువాత అధికార పార్టీ నాయకులు నామినేషన్లు వేసుకొని ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ప్రకటించుకున్నారు. ఈ విషయమై తహసీల్దార్ బ్రహ్మయ్య, సీఐ కౌలుట్లయ్యకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా అధికార పార్టీ వారికే సహకరించారని నీటిపారుదల సంఘం మాజీ అధ్యక్షుడు నూర్‌మహమ్మద్ ఆరోపించారు. న్యాయబద్ధంగా ఎన్నికలు తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కోర్టుకు పోతామని చెప్పారు.
పోలీసుల ‘పచ్చ’పాతం..
పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) సాగునీటి సంఘం ఎన్నికల్లో పోలీసులు ‘పచ్చ’పాతం చూపారు. నామినేషన్ వేసేందుకు అనుచరులతో వస్తున్న యల్లనూరు జెడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్‌రెడ్డిని సీ్త్ర శక్తిభవనం వద్దనున్న పుట్లూరు సీఐ సత్యబాబు, యల్లనూరు ఏఎస్‌ఐలు శ్రీనివాసులగౌడ్, సంపత్‌కుమార్, పోలీసుసిబ్బంది అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. సమయమంతా అక్కడే గడిచిపోయింది. దీంతో నామినేషన్ వేయకుండా వెనక్కు వెళ్లారు.
జిల్లాలో ఏకపక్షంగా ఎన్నికలు
ఇతరులెవరూ పోటీ చేయకుండా టీడీపీ నేతల అడ్డగింత
సహకరించిన అధికారులు, పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment