No Headline
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే రోడ్డులోని న్యూరో డాక్టరు వద్దకు తలనొప్పిగా ఉందని వెళితే ఏకంగా ఎంఆర్‌ఐ స్కానింగ్ రాశారని లక్ష్మీనగర్‌కు చెందిన పేషెంటు ఆవేదన చెందారు. కనీసం నాడి కూడా చూడకుండానే తలనొప్పి అనగానే ఎంఆర్‌ఐ అన్నారని వాపోయారు.
అనంతపురం సాయినగర్ నుంచి విద్యుత్ నగర్ సర్కిల్‌కు వెళ్లే దారిలో రోడ్డుకు ఎడమవైపున ఇద్దరు డాక్టర్లు (భార్యాభర్త) ఆస్పత్రి నడిపిస్తున్నారు. ఇందులో భర్త స్కిన్ స్పెషలిస్టు. ఆయన దగ్గరకు వెళితే ఫీజు సెపరేటు.. తర్వాత సబ్బులు, క్రీములు, మందులు అంటూ రూ.2 వేలు తక్కువ కాకుండా రాస్తారని స్థానిక అశోక్‌నగర్‌కు చెందిన ఓ పేషెంటు గగ్గోలు పెట్టారు.
అనంతపురం పాతూరుకు చెందిన ఓ పేషెంటు స్థానిక ధర్మవరం బస్టాండ్ సమీపంలోని సూర్యానగర్‌లో ఉన్న ఓ ఎండోక్రినాలజిస్ట్ దగ్గరకు వెళ్లాడు. అక్కడే ఉన్న ల్యాబ్‌లో బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనే డాక్టర్ అపాయింట్‌మెంట్ ఇస్తారనడంతో తెల్లవారుజామున నాలుగు గంటలకే అక్కడికి చేరుకున్నాడు. ఏనాడూ స్టెతస్కోప్ వాడని సదరు డాక్టర్..పేషెంటు రిపోర్టులు చూసి మందులు రాశారు. ఏడాది తర్వాత హైదరాబాద్‌లో చూపించుకుంటే మందులే అవసరం లేదని, ఇంకా ప్రీడయాబెటిక్ స్టేజ్‌లోనే ఉన్నావని చెప్పడంతో నిర్ఘాంతపోవడం పేషెంటు వంతైంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో కొందరు ప్రైవేటు వైద్యుల దోపిడీ పరాకాష్టకు చేరింది. చిన్న చిన్న సమస్యలతో వెళ్లినా పెద్దమొత్తంలో బిల్లు చేసి రోగుల గుండె గుబేల్‌మన్పిస్తున్నారు. మధుమేహ బాధితులు రక్తంలో గ్లూకోజు స్థాయిని తగ్గించుకునేందుకు ఎండోక్రినాలజిస్ట్ దగ్గరకు వెళితే కనీసం చూడకుండానే రక్తాన్ని పిండుకుంటున్నారు. చర్మం మీద మచ్చలొచ్చాయని వెళ్లిన వారికి స్కిన్ స్పెషలిస్టులు చర్మం వలిచేస్తున్నారు. పురిటినొప్పులతో నర్సింగ్ హోంలకు వెళితే కళ్లు బైర్లు కమ్మేలా బిల్లులు వేస్తున్నారు. సిజేరియన్‌కు ఏకంగా లక్ష రూపాయలు బిల్లు వేస్తున్న పరిస్థితి. జిల్లా కేంద్రంలోని కొందరు స్పెషలిస్టు డాక్టర్లయితే రోజురోజుకూ ఫీజులు పెంచేస్తున్నారు. ఏ డాక్టరు వద్దకు వెళ్లినా ఏమున్నది గర్వకారణం..సర్వం డబ్బు మయం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇక సవేరా వంటి కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు సామాన్య రోగులు వెళ్లే పరిస్థితే లేదు. పేషెంటు బెడ్డు ఎక్కకమునుపే లక్షలకు లక్షలు అడ్వాన్సులు కట్టించుకుంటున్నారు.
నాడిపట్టే దిక్కు లేదాయె..
అనంతపురం నగరంలోనే కాదు.. వివిధ నియోజకవర్గ కేంద్రాల్లోనూ 98 శాతం మంది డాక్టర్లు స్టెతస్కోప్ పట్టడం లేదు. పల్స్, గుండె లయ చూడటం ఎప్పుడో వదిలేశారు. ఐదు నిమిషాల్లోపే రోగ లక్షణాలడిగి మూరెడు పొడవున టెస్టులు రాస్తున్నారు. వాటికే రూ.6 వేల నుంచి రూ.10 వేలవుతోంది. తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలతో వెళితే వందశాతం ఎంఆర్‌ఐ రాస్తున్నారు. గోటితో పోయేది గొడ్డలిదాకా అన్నట్టుగా అనవసర వైద్యపరీక్షలతో రోగిని గుల్ల చేస్తున్నారు. ల్యాబుల నుంచి వచ్చే కమీషన్ల కోసం డాక్టర్లు కక్కుర్తి పడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి.
నియంత్రణ ఏదీ?
ప్రైవేటు వైద్యుల దోపిడీకి నియంత్రణే లేదు. పర్యవేక్షణ, నియంత్రణ చేయాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు లంచాలు తీసుకుని చూసీచూడనట్టు వెళుతున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింతలు, పసికందులు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ఈ విషయంలో వైద్య శాఖ ఉన్నతాధికారి సొమ్ములు కూడబెట్టుకున్నారు గానీ.. బాధితులకు ఏమాత్రమూ న్యాయం చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే ఆర్‌ఎంపీలను ఏజెంట్లుగా పెట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులు సాగిస్తున్న అరాచకాలతో రోజూ వేలాదిమంది రోగులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.
వైద్యుడి చేతిలో కన్పించని స్టెతస్కోప్
రోగ లక్షణాలు చెప్పకముందే
మూరెడు పొడవున టెస్టుల జాబితా
తలనొప్పి అనగానే ప్రిస్కిప్షన్‌లో
ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్
ప్రైవేటు ల్యాబులతో కుమ్మకై ్క వేలకు వేలు పిండుతున్న కొందరు డాక్టర్లు
సిజేరియన్ కాన్పులకు వెళుతున్న వారికి గరిష్టంగా రూ.లక్ష ఖర్చు
పరాకాష్టకు ఎండోక్రినాలజీ డాక్టర్ల దోపిడీ
Comments
Please login to add a commentAdd a comment