మీడియా స్వేచ్ఛపై దాడి సహించం
అనంతపురం/అనంతపురం సిటీ: మీడియా స్వేచ్ఛపై దాడిని సహించబోమని జర్నలిస్టులు హెచ్చరించారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేములలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ న్యూస్ కవరేజీకి వెళ్లిన సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాస్, కెమెరామెన్ రాము, సాక్షి దినపత్రిక విలేకరి గొందిపల్లి రాజారెడ్డిపై జరిగిన టీడీపీ నేతల దౌర్జన్యకాండపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనాగ్రహం పెల్లుబుకింది. అనంతపురంలో శనివారం ఉదయం జర్నలిస్టులు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే ఆందోళన చేపట్టారు. జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, ఇతర సంఘాల నేతలూ మద్దతుగా ఆందోళనలో భాగస్వాములయ్యారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలంటూ నినదించారు.
తప్పులు కప్పిపుచ్చుకోవడానికే దాడులు..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జర్నలిస్టులకు రక్షణ లేకుండాపోయిందని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. వేములలో సాక్షి జర్నలిస్టుల బృందంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. కూటమి పాలన దాడులు, దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సర్కారు తప్పులను మీడియా పసిగట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు చూపించే పాత్ర పోషిస్తుంటే.. ప్రజలను డైవర్షన్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా జర్నలిస్టులపై దాడులకు దిగడం దుర్మార్గ, అరాచక పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులకు రక్షణ కరువైంది..
రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీడబ్ల్యూజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వేముల ఘటన మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు మీడియా పట్ల ఏమైనా ప్రేమ ఉందా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితేనే వాళ్లను పట్టుకొని అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతూ కేసులు పెడుతున్న ప్రభుత్వ పెద్దలు.. వేములలో సాక్షి జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై పీడీ యాక్ట్‌లు పెట్టాలని డిమాండ్ చేశారు.
● సాక్షి జర్నలిస్టుల బృందంపై దాడిని ఏపీడబ్ల్యూజే(ఎఫ్) జిల్లా ప్రతినిధి రేపటి రామాంజనేయులు ఖండించారు. మీడియా మీద దాడులు చేసుకుంటూ పోతే మా కెమెరాలన్నీ మీవైపు తిప్పితే ఏమవుతారో ఆలోచించాలని సూచించారు.
● ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ మాట్లాడుతూ వేముల ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
● జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు వృత్తిరీత్యా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో సాక్షి బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, ఎడిషన్ ఇన్‌చార్జ్ మహేశ్వర రెడ్డి, సాక్షి టీవీ కరస్పాండెంట్ శివారెడ్డి, ఎన్‌టీవీ కరస్పాండెంట్ శ్రీనివాసులు, ఏపీజేడీఎస్ జిల్లా కార్యదర్శి విజయరాజు, సాక్షి జర్నలిస్టులతో సహా వివిధ పత్రికల ప్రతినిధులు, సబ్ ఎడిటర్లు, ఎలక్ట్రానిక్, యూట్యూబ్ చానళ్ల విలేకరులు, ఫొటో, వీడియా గ్రాఫర్లు, పత్రికల అనుబంధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
వేములలో సాక్షి జర్నలిస్టులపై
దాడికి నిరసన
సంఘీభావం తెలిపినజెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
జర్నలిస్టు, ప్రజా సంఘాల
ప్రతినిధుల మద్దతు
Comments
Please login to add a commentAdd a comment