హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నిద్దాం
అనంతపురం కల్చరల్: ప్రతి చోటా సాగుతున్న హక్కుల ఉల్లంఘన లేకుండా ఆధిపత్యాన్ని ప్రశ్నిద్దామని వక్తలు సూచించారు. హెచ్‌ఆర్‌ఎఫ్ (మానవ హక్కుల వేదిక) 10వ రాష్ట్ర మహాసభలు శనివారం స్థానిక ఆపిల్ ఫంక్షన్ హాలులో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అంతర్గత సమావేశాలు, వివిధ జిల్లాల కమిటీల ఎంపిక జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 144 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభల ఆహ్వాన కమిటి అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్, తెలంగాణ హెచ్‌ఆర్‌సీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, డాక్టర్ తిరుపతి, ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, రాజేష్, కర్ణాటక ప్రతినిధి శ్రీధర్ తొలి సందేశం ఇచ్చారు. పీపుల్స్ డెమెక్రటిక్ ఫ్రంట్, ఏపీ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. అనంతరం పలు తీర్మానాలను ఆమోదించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు చేయాలని, ప్రార్థనా స్థలాల చట్టం 1991ను అమలు చేసి మైనార్టీల ప్రార్థనా స్థలాల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని వక్తలు డిమాండ్ చేశారు. నూతన విద్యావిధానం –2020 ద్వారా చేపడుతున్న కాషాయికరణ , కార్పొరేటికరణను ఆపేయాలన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల కేసుల్లో దర్యాప్తు విచారణ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు. అనంతరం మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీలను ఎన్నుకున్నారు. ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులుగా అనంతకు చెందిన చంద్రశేఖర్‌తో పాటూ జీవన్‌కుమార్, వసంతలక్ష్మి, కృష్ణ తదితరులున్నారు.
మానవ హక్కుల వేదిక రాష్ట్రసభల్లో వక్తలు
Comments
Please login to add a commentAdd a comment