30 ఏళ్లుగా పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదు
● ఫీల్డు అసిస్టెంట్ పోస్టులు కూడా అమ్ముకున్నారు
● ఎమ్మెల్యే శ్రావణి ఇంటి వద్ద టీడీపీ నాయకుడి ధర్నా
గార్లదిన్నె: పార్టీ కోసం తమ కుటుంబం 30 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదని గార్లదిన్నె మండలం కనంపల్లికి చెందిన టీడీపీ నాయకుడు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి అనంతపురం నగరంలోని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ కోసం ఎంతో సేవ చేసిన తనకు కనీసం ఫీల్డు అసిస్టెంట్ పోస్టు కూడా ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే తల్లి ఒక్కో ఫీల్డు అసిస్టెంట్ పోస్టు రూ.5 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామనే ఉద్దేశంతో తనపై, కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. ఇప్పటికై నా అధిష్టానం స్పందించి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరారు.
అగ్రిగోల్డ్ బాధితులకు
న్యాయం చేయాలి
పుట్లూరు: ఎన్నికలకు ముందు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని కూటమి పెద్దలు ఇచ్చిన హమీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నెరవేర్చడంలో విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం ఆయన పుట్లూరు మండలం చెర్లోపల్లి వద్ద ఉన్న 217 ఎకరాల అగ్రిగోల్డ్ భూములను పరిశీలించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యువకుడి హత్య
కుందుర్పి: మండలంలోని వడ్డెపాళ్యం గ్రామానికి చెందిన గిత్తరాజు (28) హత్యకు గురయ్యాడు. జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలోని శీగలపల్లి క్రాస్ వద్ద గురువారం రాత్రి ఆయనను దుండగులు హతమార్చారు. కాగా, కుందుర్పి మండలం మలయనూరు గ్రామానికి చెందిన ఓ యువతితో గిత్తరాజు వివాహేతర సంబంధం నెరపేవాడు. ఈ క్రమంలో యువతి తరఫు కుటుంబసభ్యులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో వారే పథకం ప్రకారం గిత్తరాజును హతమార్చినట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై కర్ణాటకలోని పరుశురాంపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పరుశురాంపురంలో ఒకరిని, మలయనూరులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. కాగా, హతుడు గిత్తరాజుకు భార్య ఈశ్వరమ్మ, ఆరు నెలల వయసున్న చిన్నారి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment