కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ
● పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేత అక్రమ నిర్మాణం
యాడికి: మండలంలోని తూట్రాళ్లపల్లిలో టీడీపీ నేత లక్ష్మీరెడ్డి సోమవారం రాత్రికి రాత్రే రోడ్డును ఆక్రమించి అరుగు నిర్మించాడు. లోకాయుక్త ఆదేశాలను ధిక్కరించి యథేచ్ఛగా చేపట్టిన ఈ నిర్మాణానికి పోలీసులు రక్షణగా నిలవడం గ్రామస్తులను విస్మయానికి గురి చేసింది. వివరాలు... తూట్రాళ్లపల్లికి చెందిన వెంకటనాగిరెడ్డి, లక్ష్మీరెడ్డి కుటుంబాలు ఎదురెదురు ఇళ్లలో నివాసముంటున్నాయి. కొంత కాలంగా లక్ష్మీరెడ్డి తన ఇంటికి ఆనుకుని రోడ్డుపై రాళ్లు, ఎద్దులబండి అడ్డం పెట్టాడు. దీంతో ఇంటి నుంచి ట్రాక్టర్ బయటకు తీయడానికి ఇబ్బంది అవుతుండడంతో వెంకటనాగిరెడ్డి లోకాయుక్తను ఆశ్రయించాడు. దీంతో లక్ష్మీరెడ్డి ఏర్పాటు చేసిన వాటిని తొలగించాలంటూ ఎంపీడీఓకు లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వారాల క్రితం ఎంపీడీఓ వీర్రాజు, పోలీసులు అక్కడకు చేరుకుని రోడ్డుపై ఉంచిన రాళ్లను తొలగించారు. ఈ క్రమంలో లక్ష్మీరెడ్డి... లోకాయుక్త ఉత్తర్వులను ధిక్కరిస్తూ శనివారం రాత్రి అరుగు నిర్మాణం చేపట్టాడు. దీంతో వెంకటనాగిరెడ్డి ఎంపీడీఓ, పంచాయతీ అధికారులకు తెలిపినా వారు స్పందించలేదు. డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని నిర్మాణాన్ని ఆపారు. లక్ష్మీరెడ్డి దౌర్జన్యంపై సోమవారం ఎంపీడీఓను కలసి వెంకటనాగిరెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు పది మంది కూలీలను ఏర్పాటు చేసుకుని లక్ష్మీరెడ్డి అరుగు నిర్మాణం చేపట్టడంతో వెంకటనాగిరెడ్డి మరోసారి డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వారి సమక్షంలోనే లక్ష్మీరెడ్డి అరుగు నిర్మాణం పూర్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment