కోడిపందెం రాయుళ్ల అరెస్ట్
వజ్రకరూరు: మండలంలోని గూళ్యపాళ్యం పరిసరాల్లో కోడి పందెం ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు. అందిన పక్కా సమాచారంతో మంగళవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో గూళ్లపాళ్యం సమీపంలో కోడి పందెం ఆడుతూ తొమ్మిది మంది పట్టుబడ్డారు. వీరి నుంచి మూడు పందెం కోళ్లు, రెండు కత్తులు, రూ.1,4750 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
పెద్దవడుగూరు: మండలంలోని ఎ.తిమ్మాపురం సమీపంలో బుధవారం పేకాట ఆడుతూ పలువురు పోలీసులకు పట్టుపడ్డారు. అందిన పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకుని రూ.42,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.
పలు ప్రాంతాల్లో చోరీలు
గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ పక్కన ఉన్న బంకుతో పాటు ఆ పక్కనే ఉన్న మరో హోటల్‌లో దుండగులు చొరబడి విలువైన సామగ్రి అపహరించారు. వివరాలు... సతీష్‌కు చెందిన బంక్ తాళాలు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగులు రూ.3 వేల నగదుతో పాటు రూ.3 వేల విలువైన సిగరెట్లు అపహరించారు. రామాంజనేయులుకు చెందిన హోటల్‌లో రూ.3 వేల నగదుతో పాటు విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
బస్సును ఢీకొన్న కారు
గార్లదిన్నె: ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటన గార్లదిన్నె మండలంలో చోటు చేసుకుంది. వివరాలు... బుధవారం అనంతపురం నుంచి గుంతకల్లుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు... గార్లదిన్నెలో పెనకచెర్ల డ్యాం క్రాస్ వద్ద ప్రయాణికులను దింపేందుకు ఆగింది. అదే సమయంలో బస్సు వెనకనే వచ్చిన కారు నుంచి ముకుందాపురానికి చెందిన వ్యక్తి దిగి పెనకచెర్ల డ్యాం క్రాస్ వైపుగా వెళుతుండగా ఉన్నఫళంగా కారు ముందుకు దూకి ఎదురుగా ఉన్న బస్సును ఢీకొంది. ఘటనలో కారు ఢోరు ధ్వంసమైంది. ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాగా, కారు డ్రైవర్ అజాగ్రత్తనే ప్రమాదానికి కారణంగా తెలిసింది.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
పెనుకొండ: మంత్రి సవిత పుట్టినరోజు వేడుకలకు వచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలిపి స్వగ్రామానికి తిరిగి వెళ్తూ ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒకరు చనిపోగా మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. వివరాల్లోకెళితే.. రొద్దం మండలం ఎం. కొత్తపల్లికి చెందిన బోయ సంజీవప్ప, బోయ వీరన్న టీడీపీ కార్యకర్తలు. బుధవారం మంత్రి సవిత పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలపడానికి పెనుకొండకు వచ్చారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. అయితే పెనుకొండ రైల్వేగేటు దాటిన తర్వాత మైక్రోస్టేషన్ వద్ద ఘాట్ రోడ్డులో వాహనం అదుపుతప్పింది. తీవ్ర గాయాలైన బోయ సంజీవప్పను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన బోయ వీరన్నను బెంగళూరుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment