పాతుకుపోయారు!
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో రెవెన్యూ శాఖది ప్రత్యేక స్థానం. పరిపాలనా వ్యవహరాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న రెవెన్యూ శాఖలో నియమితులైన డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల సేవలు చాలా కీలకంగా ఉంటాయి. అయితే ఇతర శాఖల్లో మాదిరి రెవెన్యూ శాఖలో ఒకే స్టేషన్‌లో ఐదేళ్ల సర్వీసు నిబంధన అమలు కావడం లేదు. ప్రధానంగా ఉద్యోగుల బదిలీలు, ఇందులోనూ డిప్యూటీ తహసీల్దార్ల విషయంలో ఇది తేటతెల్లమవుతోంది. కేఆర్‌ఆర్‌సీ, ఆర్‌డీఓ, అర్బన్, రూరల్ తహసీల్దారు, భూ సంస్కరణలు, జిల్లా సరఫరాల శాఖ, పీఏబీఆర్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, హెచ్చెల్సీ, డ్వామా, అహుడా, ట్రాన్స్‌కో... ఇలా వివిధ శాఖల్లో డిప్యూటీ తహసీల్దార్లు సేవలు అందిస్తున్నారు. ఒక డిప్యూటీ తహసీల్దారు ఆయా శాఖల్లో ఐదేళ్లు పనిచేసినా... ఒకే స్టేషన్ (కేంద్రం)లో ఐదేళ్లు సర్వీసు పూర్తయినా మరో స్టేషన్‌కు బదిలీ చేయాలనే నిబంధన స్పష్టంగా ఉంది. అయితే ఈ నిబంధన రెవెన్యూ శాఖలో అమలు కావడం లేదు. ఎన్ని దఫాలు బదిలీ (స్థాన చలనాలు) జరిగిన పలువురు డిప్యూటీ తహసీల్దారులు జిల్లా కేంద్రం వీడడం లేదు. బదలీల పేరుతో కలెక్టరేట్ లేదంటే ఇతర కార్యాలయాలకు చక్కర్లు కొడుతున్నారే తప్ప జిల్లా కేంద్రం వీడడం లేదు. ఇలా దాదాపు 12 మంది డిప్యూటీ తహసీల్దార్లు జిల్లా కేంద్రంలోనే తిష్ట వేశారని రెవెన్యూ వర్గాలే చెబుతుండడం గమనార్హం. కొందరైతే ఏకంగా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జిల్లా కేంద్రంలోనే వివిధ శాఖలకు స్థాన చలనం పొందుతున్నట్లు సమాచారం. అయితే అందరి విషయంలోనూ ఇలాగే ఉంటుందనుకుంటే పొరపాటే. రెవెన్యూశాఖలో ‘మేనేజ్’ చేసుకోవడం చేతనైన వారు మాత్రమే జిల్లా కేంద్రంలో ఉంటున్నారు. అలా మేనేజ్ చేసుకోవడం రానివారు జిల్లా కేంద్రం వీడాల్సి వస్తోంది. ఇదంతా గమనించిన మిగిలిన సిబ్బంది ఇదే ఇక్కడి ‘రూల్’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రాన్ని వీడని డీటీలు
15 ఏళ్లుగా వివిధ శాఖలకు చక్కర్లు
Comments
Please login to add a commentAdd a comment