సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దేవదాయ శాఖ ఆదీనంలో ఉన్న వేద ఆగమ పాఠశాలల్లో సంప్రదాయ వేద విద్యతో పాటు గణితం, సైన్స్, ఆంగ్లం, కంప్యూటర్ బేసిక్స్, సోషల్ వంటి ఆధునిక విద్యా బోధనను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వేద, ఆగమ తరగతులకు అదనంగా ప్రతి వారం రెండేసి గంటలు ఆధునిక సబ్జెక్టులతో తరగతులు నిర్వహించాలని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని 12 వేద, ఆగమ పాఠశాలల ఈవోలకు సూచనలు చేశారు.
చదవండి: AP: భలే చాన్స్.. విద్యుత్ బకాయిలకు వన్ టైమ్ సెటిల్‌మెంట్
వేద పాఠశాలలో చదివే విద్యార్థులను వయస్సు, ఇతర అర్హతల ఆధారంగా ఒపెన్ స్కూల్ విద్యా విధానంలో మూడు, ఐదు, ఎనిమిది, పది, ఇంటరీ్మడియట్ పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉదయం లేదా సాయంత్రం కనీసం ఒక గంట శారీరక వ్యాయామం తరగతులు కూడా నిర్వహించాలని చెప్పారు. ప్రస్తుతం వేద పాఠశాలలో వేద, ఆగమ తరగతులను మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక్కడి విద్యార్ధులు తర్వాత కాలంలో సహచర ఆధునిక విద్యను అభ్యసించి విద్యార్ధులతో పోటీ పడలేకపోతున్నారని, అందువల్ల ఇతర సబ్జెక్టులనూ బోధించాలని అర్చక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తిరుపతిలో కంచి పీఠం నిర్వహించే వేద పాఠశాలలో ఆధునిక విద్యా బోధన చేయడాన్ని ఉదహరించాయి. ఈ ప్రతిపాదనలపై గతంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో చర్చించారు. దేవదాయ శాఖ పరిధిలోని వేద, ఆగమ పాఠశాలల్లో ఆధునిక విద్యా బోధనలకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అర్చక సంఘాలు స్వాగతించాయి.
వేద పాఠశాలలోనూ ఎక్కువ మంది చేరతారు: అర్చక సమాఖ్య
కంచి మఠం వేద పాఠశాల తరహాలో దేవదాయ శాఖ పరిధిలోని వేద, ఆగమ పాఠశాలల్లో ఆధునిక సబ్జెక్టుల బోధన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయంతో వేద పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరతారని చెప్పారు. విద్య పూర్తి చేసిన తరువాత వారికీ ఇతర రంగాల్లో అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment