హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా కోనో కార్పస్ మొక్కలను కొట్టేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ మొక్కల వల్ల మానవాళికి, పర్యావరణానికి హాని ఉందో లేదో తేల్చేందుకు నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, నాగార్జున యూనివర్సిటీ బోటనీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ కె.బయపురెడ్డి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్లాంట్ ప్రొఫెసర్ కె.రామచంద్రారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, నెల్లూరు, కాకినాడ జిల్లాల కలెక్టర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. కోనో కార్పస్ మొక్కల వల్ల మానవాళికి, పర్యావరణానికి హాని ఉందని ఇప్పటివరకు శాస్త్రీయంగా నిరూపితం కాలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ చెట్ల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని అశ్రాస్తీయ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ఇవి ఉన్నాయని, వీటి నిర్వహణ చాలా సులభమని, అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ మనుగడ సాగిస్తాయన్నారు.
ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్న తప్పుడు అభిప్రాయంతో వీటిని కొట్టేయాలని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని, ఇందుకు అధికారులు సైతం సిద్ధమవుతున్నారని వారు వ్యాజ్యంలో పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో ఇప్పటికే 4,600 కంటే ఎక్కువ మొక్కలు కొట్టేశారని, నెల్లూరు జిల్లాలోనూ కొట్టేస్తున్నారని తెలిపారు. కేవలం భయాందోళనల కారణంగా, శాస్త్రీయ అధ్యయనం చేయకుండా పర్యావరణానికి అనుకూలమైన ఈ మొక్కలను కొట్టేయడం తగదన్నారు. వీటిని కొట్టేసే వారిపై వాల్టా చట్టం కింద చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోర్టును కోరారు. విచక్షణా రహితంగా చెట్లను కొట్టేస్తున్న వారిపై వాల్టా చట్టం కింద చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఈ చట్ట నిబంధనలను అమలు చేయడంలేదని తెలిపారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment