విష వృక్షాలుగా ఎదిగిపోయిన విద్యా రంగ కలుపు మొక్కలకు మందు వేయటం మొదలైంది. కొంత సమయం పట్టినా... ఆరంభమయ్యింది కనక అంతమూ జరిగి తీరుతుంది. కానీ ఈ పరిణామం ఎల్లో ముఠా మేస్త్రీ ‘ఈనాడు’ను, విత్తులేసి పెంచి పోషించిన తెలుగుదేశాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. అందుకే సంస్కరణలతో విద్యా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోతోందంటూ గగ్గోలు మొదలయ్యింది. ఇదెలా ఉందంటే... జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స చేయొద్దని, చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని ధర్నాకు దిగినట్టుగా!!. ఇంగ్లిష్ మీడియం పెట్టడం వల్ల విద్యార్థులు ఆంగ్లంలో చదవలేక ప్రభుత్వ స్కూళ్లు వదిలేసి వెళ్లిపోతున్నారనే వింత వాదన విన్నాక... వీరి మానసిక స్థితి తేలిగ్గానే తెలిసిపోతుంది. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందకూడదని వీళ్లెన్ని కుట్రలు పన్నుతున్నారో అర్థమవుతుంది. ఇలాంటి రాతలను అధికారులెవరైనా ఖండిస్తే... సామాజిక కార్యకర్తల పేరిట తెలుగుదేశం కార్యకర్తల చేత లేఖలు రాయించి... వారికి సామాజిక కార్యకర్తలనే ముసుగు వేసి ప్రచురించటమనే విద్యలో కూడా ఇపుడు రామోజీరావు ఆరితేరిపోయారు. పొద్దున్న లేస్తే పచ్చ పత్రికలు వండి వార్చిన ప్రభుత్వ వ్యతిరేక వార్తలను, వాటి అధిపతుల కామెంట్లను, చంద్రబాబు నిస్సిగ్గుగా చేసే ఆరోపణలను సామాజిక మాధ్యమాల్లో వ్యాపింపజేసే వ్యక్తులకు కూడా సామాజిక కార్యకర్తల ముసుగేస్తే ఎలా రామోజీరావు గారూ?
తెలుగుదేశం కార్యకర్త అనో, ఎల్లో మీడియా సానుభూతిపరుడనో రాస్తే పోయేది కదా? ఇంకా ఎన్నాళ్లీ డ్రామాలు? మీ పిల్లలు చదువుతున్నదెక్కడ? ఇంగ్లిష్ మీడియంలోనే కదా? పేద పిల్లలకు ఆ చదువు అందకూడదని ఎందుకింత కక్ష? అని అధికారులు సూటిగా మీ ఎల్లో ముఠాని అడిగితే... దానికి వార్త రాసిన పాత్రికేయులను అడిగినట్లుగా రంగేసి... ఐఏఎస్‌ల పిల్లలు చదువుతున్నదెక్కడ? అంటూ మీ సామాజిక కార్యకర్తతో ప్రశ్న అడిగించారంటే మీ బుద్ధి భూమిలోకి పోయిందని అర్థం కావటం లేదూ? ఐఏఎస్‌లు తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ ఉండొచ్చు. వారేమీ పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులొద్దని మీలా చెప్పటం లేదు కదా? మరి వారి ప్రస్తావనెందుకు? మరీ ఇలా తలాతోకా లేని ప్రశ్నలేసి మీకు మీరే శెహబాష్‌లు చెప్పుకుంటే ఎలా?
ప్రభుత్వ స్కూళ్లపై విషం చిమ్మటం వెనక రామోజీరావు ఆందోళన ఒక్కటే. ప్రభుత్వ స్కూళ్లను ఫణంగా పెట్టి తాము పెంచిపోషించిన కొన్ని కార్పొరేట్ స్కూళ్లకు నూకలు చెల్లుతున్నాయన్నదే!. గాలీవెలుతురూ లేని భారీ భవనాల్లో.. విద్యార్థులను బట్టీపట్టే యంత్రాల్లా మార్చేసే ఈ ‘కార్పొరేట్’ స్కూళ్లకు కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబు ఇపుడు అధికారంలో లేరన్నదే ఆయన బాధ. అందుకే... ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తూ.. మౌలిక సదుపాయాలతో పాటు బోధనాభ్యసన ప్రక్రియల్లో సమూల మార్పులు తెస్తున్న వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆయనకు సుతరామూ నచ్చటం లేదు. అందుకే సోమవారం ‘పిల్లలపై పిడుగు’ పడేశారు. దానికి మంత్రి, అధికారులు జవాబివ్వగా... తమ ‘సామాజిక కార్యకర్త’ ద్వారా దానిపై ఓ వంకర లేఖను రాయించి అచ్చు వేశారు.
ఇవీ.. విద్యార్థుల సంఖ్యపై వాస్తవాలు
2014–15లో ప్రభుత్వ స్కూళ్లలో 42 లక్షల మంది విద్యార్థులుండగా చంద్రబాబు హయాంలో అది 37 లక్షలకు దిగజారిపోవటం అబద్ధమా? ఆ సంఖ్య ఇపుడు 40.31 లక్షలకు పెరగటం అబద్ధమా? బాబు కాలంలో ప్రయివేటు స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్య 27 లక్షల నుంచి 32 లక్షలకు పెరగటం అబద్ధమా? ఆ ఐదు లక్షల మందినీ మీరే మీ కార్పొరేట్ స్కూళ్లకు ఫీడ్ చేయటం అబద్ధమా? ఇవన్నీ పచ్చి నిజాలు కావా రామోజీ? వీటిని మీ పత్రికలో ఎందుకు రాయరు? ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల పలితంగా ఇపుడు ఎయిడెడ్‌తో కలిసి విద్యార్థుల సంఖ్య 41.44 లక్షలకు చేరిందని, ప్రైవేటు స్కూళ్ల కన్నా (30.18 లక్షలు) ప్రభుత్వ స్కూళ్లలో ఏకంగా 11 లక్షల మంది విద్యార్థులు అధికంగా ఉన్నారని ఎన్నడూ చెప్పరెందుకు? బాబు జమానాతో పోలిస్తే ఇపుడు ప్రయివేటు స్కూళ్లలో 4 లక్షల మంది విద్యార్థులు అధికంగా ఎందుకున్నారు? సర్కారీ విద్యలో తెచ్చిన మార్పుల వల్లే కదా? దీన్నెందుకు చెప్పరు?
ఇంగ్లిష్ మీడియంపై ఏడుపెందుకు?
పేదపిల్లలు ఇంగ్లిష్ మీడియం చదివితే తమ సామ్రాజ్యాలకు కూలీలు దొరకరనే బెంగ రామోజీకి ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఇంగ్లిష్ మీడియాన్ని అడ్డుకోవటానికి ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి కోర్టులకెక్కి మరీ యాగీ చేశారు. కానీ విద్యార్థులకు ఏ మీడియం కావాలని అడిగితే 98 శాతం ఇంగ్లిష్‌నే ఎంచుకున్నారు. దాంతో ఆ మాధ్యమం అమల్లోకి వచ్చింది. వీరికి తేలిగ్గా అర్థం కావటం కోసం పాఠ్య పుస్తకాల్లో ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లిష్ ఉండేలా బైలింగ్యువల్ బుక్స్‌ను అందిస్తోంది ప్రభుత్వం. ఎల్లో ముఠా ఊహించని ఈ పరిణామాన్ని ఇపుడు ఇతర రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకున్నాయి.
ఇక బాలికల కోసం ప్రతి మండలానికి ప్రత్యేకంగా ఓ జూనియర్ కాలేజీని ఏర్పాటుచేసి వారు పదో తరగతి తరువాత చదువు కొనసాగించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వారి కోసం ప్రత్యేకంగా హైస్కూలు ప్లస్ ఏర్పాటు చేయటంతో పాటు... దేశవ్యాప్తంగా మన విద్యార్థులు ఇతరులతో పోటీ పడేందుకు అంతటా అమలు చేస్తున్న సీబీఎస్‌ఈ విధానాన్ని రాష్ట్రం కూడా అమల్లోకి తెస్తోంది. చంద్రబాబు హయాంలో ఇలాంటి ఆలోచనలు కూడా రాకపోవటంతో... ఈ సంస్కరణలు విద్యా రంగాన్ని సమూలంగా మార్చి, ఈ రాష్ట్రంలో తమకు పుట్టగతులుండకుండా చేస్తాయనే భయం ఎల్లో ముఠాను వేధిస్తోంది. అందుకే పాలనా పరమైన చిన్న చిన్న కారణాలను భూతద్దంలో చూపిస్తూ మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా విష ప్రచారానికి దిగుతోంది.
సెల్‌ఫోన్లు భారమవుతాయా?
కోవిడ్ కారణంగా విద్యార్ధుల్లో అభ్యసన సామర్థ్యాలు దెబ్బతిన్నాయని అసర్, ఎన్‌ఏఎస్ వంటి సర్వేలు తేల్చాయి. దీన్ని పరిష్కరించడానికి... ఎడ్యుకేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు గూగుల్ రీడ్ ఎలాంగ్, పిఎఎల్, బైజూస్ మొదలైన లెర్నింగ్ యాప్‌లను పరిచయం చేయడం... రెమిడియల్ టీచింగ్, స్కూళ్లకు– టీచర్లకు ర్యాకింగ్, టీచర్ కెపాసిటీ బిల్డింగ్ వంటివి రూపొందించారు. ఆన్‌లైన్ ఎడ్యుటెక్ కంపెనీలందించే కంటెంట్ కేవలం కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమైన పరిస్థితుల్లో... ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దిగ్గజ ఎడ్యుటెక్ సంస్ఠ ‘బైజూస్’ నుంచి పాఠ్యాంశాలందేలా ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
అన్ని తరగతులనూ డిజిటజైజ్ చేసి విద్యార్ధులకు అత్యుత్తమ బోధన అందేలా చేస్తోంది. ‘బైజూస్’ కంటెంట్‌తో 2025లో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా 8వ తరగతి విద్యార్థులకు, వారికి బో«ధించే ఉపాధ్యాయులకు 5.18 లక్షల మందికి ట్యాబ్‌లను ఈ నవంబరు చివరికల్లా పంపిణీ చేయనున్నారు. అంటే... ప్రతి విద్యార్థికీ రూ.36వేల విలువైన ల్యాప్‌టాప్, బైజూస్ కంటెంట్ ఉచితంగా అందుతుంది. అలాగే 4వ తరగతి నుంచి పిల్లలకు వేల రూపాయల ఖర్చయ్యే బైజూస్ కంటెంట్... ప్రత్యేక యాప్ ద్వారా ఉచితంగా అందనుంది. తల్లిదండ్రుల ఫోన్లలోనో, ఇంట్లో ఉండే వేరే ఫోన్లలోనో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, ఇంట్లో ఉన్నపుడు అభ్యసించొచ్చు. ఇదీ వాస్తవం. కానీ సెల్‌ఫోన్లకోసం రూ.8వేల భారం అంటూ అసత్యాలను ప్రచారం చేయటం ‘ఈనాడు’ మార్కు పాత్రికేయం.
స్కూళ్లు మూతపడిందెక్కడ రామోజీ?
3వ తరగతి నుండి అన్ని తరగతులకూ అర్హత కలిగిన సబ్జెక్ట్ ఉపాధ్యాయులను అందించడానికి పాఠశాలల్ని 5:3:3:4 నమూనాలో 6 రకాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ (పీపీ1, పీపీ2), ఫౌండేషన్ స్కూల్ (పీపీ1, పీపీ2 క్లాస్ 1 – 2), ఫౌండేషన్ స్కూల్ ప్లస్ (పీపీ1, పీపీ2 క్లాసులు 1 నుండి 5) ప్రీ–హై పాఠశాల (తరగతులు 3 నుండి 7/8 వరకు) హైస్కూలు (తరగతులు 3 నుండి 10 వరకు) హైస్కూలు ప్లస్‌గా (తరగతులు 3 నుండి 12 వరకు) వీటిని మార్పు చేస్తోంది. దీనికి తగ్గట్టుగా స్కూళ్ల మ్యాపింగ్ చేయిస్తున్నారు. ఇప్పటివరకు 494 ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలోని 3,4,5 తరగతులను 1 కి.మీ.లోపులో ఉన్న 428 ప్రీ–హై స్కూళ్లకు అనుసంధానించారు.
4237 ఫౌండేషన్ ప్లస్ పాఠశాలల్లోని 3,4,5 తరగతులను 1 కి.మీ.లోపు ఉన్న 2944 ఉన్నత పాఠశాలలకు మ్యాప్ అయ్యాయి. 21 ప్రీ–హై స్కూళ్లలోని 3 నుండి 8 తరగతులను 18 హైస్కూళ్లకు మ్యాప్ చేశారు. 191 ప్రీ–హై స్కూళ్లలోని 3 నుండి 8 తరగతులను 1 కి.మీ.లోపు ఉన్న 167 హైస్కూళ్లకు మ్యాపింగ్ చేశారు. మొత్తంగా 4943 ఫౌండేషన్ ప్లస్, ప్రీహైస్కూళ్లలోని కొన్ని తరగతులు 3557 ప్రీ హైస్కూల్, హైస్కూళ్లలో మ్యాప్ అయ్యాయి. వీటిలో 3వ తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా బో«ధిస్తారు. దీనికోసం ఇప్పటికే 4,421 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ల పోస్టులుగా అప్‌గ్రేడ్ చేశారు.
అప్‌గ్రేడ్ చేసిన హైస్కూళ్లకు హెడ్‌మాస్టర్ పోస్టులను అందించడానికి 998 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్ని హెచ్‌ఎంలుగా అప్‌గ్రేడ్ చేశారు. పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున ఎంఈఓలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో రెండో ఎంఈఓ కోసం 679 పోస్టులను అదనంగా మంజూరు చేశారు కూడా. డెప్యూటీ డీఈఓ పోస్టులను 53 నుంచి 74కు పెంచారు.
మ్యాపింగ్ వల్ల విద్యార్ధులు ఉత్తమ ప్రమాణాలు సంతరించుకుంటారని, ఒక్క పాఠశాల కూడా మూతపడదని ప్రభుత్వం చెబుతున్నా రామోజీ మాత్రం తప్పుడు కూతలు మానటం లేదు. కొత్త విధానానికి అనుగుణంగా ఆయా స్కూళ్లకు అవసరమైన అదనపు తరగతి గదులను ప్రభుత్వం నిర్మిస్తోంది. కొన్ని చోట్ల సమస్యలు ఎదురవ్వగా స్థానిక విద్యాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి ముసుగేసి... విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారంటూ ఒకటీ అరా ప్రాంతాల్లోని సమస్యను రాష్ట్రమంతటికీ వర్తింపజేసి విషం చిమ్ముతోంది ఎల్లో ముఠా.
సీబీఎస్‌ఈ విధానంపైనా అదే తీరు...
దేశవ్యాప్తంగా విద్యార్థులతో పోటీ పడటానికి ప్రభుత్వ స్కూళ్లలోనూ సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది ఈ ప్రభుత్వమే. ఇప్పటివరకు 1,247 పాఠశాలలు సీబీఎస్‌ఈ విధానంలోకి వచ్చాయి. సీబీఎస్‌ఈని దృష్టిలో ఉంచుకుని, 8వ తరగతికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఎన్‌సీఈఆర్టీ అంశాలతో ద్విభాషా పుస్తకాలుగా ముద్రించారు. 8వ తరగతి ఉపాధ్యాయులు సీబీఎస్‌ఈ మోడ్‌లో శిక్షణ పొందారు.
సీబీఎస్‌ఈ అనుబంధ స్కూళ్ల విద్యార్ధులు ఆ బోర్డు నిర్వహించే పరీక్షలు రాస్తారు. అనుబంధం లేకున్నా సీబీఎస్‌ఈ సిలబస్ చదువుతున్న విద్యార్ధులకు అందుకు అనుగుణంగా ఎస్సీఈఆర్టీ పరీక్షలు నిర్వహిస్తుంది. దీనిపై అవగాహన లేని రామోజీ... విద్యార్దులకు ఇబ్బందంటూ తోచిన కథనాన్ని వండేశారు.
బాలికల విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనపడటం లేదా?
హైస్కూల్‌లో ఉత్తీర్ణులైన బాలికలెవరూ చదువు మానేయకుండా కొనసాగించేలా ప్రతి మండలంలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. దీనికోసం 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. 352 కేజీబీవీలలో ప్లస్ 2 తరగతులు ప్రవేశపెట్టారు. వీటికి తగినంత మంది టీచర్లను, అధ్యాపకులను ఏర్పాటు చేస్తున్నారు. కొద్దిరోజుల్లో ఇది పూర్తవుతుంది. ప్రస్తుత స్కూల్ అసిస్టెంట్లకు లెక్చరర్లుగా పదోన్నతులివ్వటంతో పాటు ప్రత్యేకంగా జూనియర్ లెక్చరర్ల నియామకానికీ ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. దీన్ని మరుగున పడేసి... స్కూల్ అసిస్టెంట్లతోనే నెట్టుకొస్తున్నట్లు అవాస్తవాలు గుప్పించారు.
ఇవీ... సంస్కరణలంటే
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యమిస్తూ... కునారిల్లిన విద్యా వ్యవస్థకు చికిత్స మొదలెట్టింది. దీన్లో భాగంగానే నాడు–నేడు పేరిట స్కూళ్లను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దటంతో పాటు పిల్లలను బడికి పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు జగనన్న అమ్మఒడి... స్కూళ్లు తెరిచేనాటికే షూ, యూనిఫామ్‌తో సహా పుస్తకాలన్నీ విద్యార్థులకు ఉచితంగా అందించే జగనన్న విద్యాకానుక... ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారంతో జగనన్న గోరుముద్ద... పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎంఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి (ఎస్‌ఎంఎఫ్) వంటి కార్యక్రమాలను చేపట్టింది. రాష్ట్ర విద్యా రంగాన్ని మారుస్తూ... భావి తరాన్ని సమర్థంగా తీర్చి దిద్దే ఈ యజ్ఞం... పచ్చ ముఠా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆయా పథకాలు చూస్తే...
జగనన్న అమ్మ ఒడి
2018లో కేంద్రం గణాంకాల ప్రకారం ఏపీలో ప్రాథమిక విద్యలో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఈఆర్) 84.48. జాతీయ సగటు 99.21తో పోలిస్తే ఇది తక్కువ. ఈ సమస్యను పరిష్కరించడానికి స్కూళ్లకు పిల్లల్ని పంపే అర్హులైన తల్లి లేదా సంరక్షకుడికి ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏటా రూ.15,000 ఇస్తోంది. ఈ మూడేళ్లలో రూ.19,617.6 కోట్లు జమ చేయటం ద్వారా 44.49 లక్షల మంది తల్లులకు, 84 లక్షల విద్యార్ధులకు లబ్ధి చేకూర్చింది ప్రభుత్వం. పాఠశాలల్లో చేరికలూ పెరిగాయి.
మనబడి నాడు–నేడు...
ప్రభుత్వ పాఠశాలల్లో 11 రకాల మౌలిక సదుపాయాలను కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటమే నాడు–నేడు ఉద్దేశం. రన్నింగ్ వాటర్ తో టాయిలెట్లు, తాగునీటి సరఫరా, మరమ్మతులు, ఫ్యాన్లు ట్యూబ్ లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశలో 15,715 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించారు. దీనికోసం రూ.3669 కోట్లు ఖర్చు చేశారు. రెండో దశలో రూ.8వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టారు.
జగనన్న గోరుముద్ద
నాణ్యమైన, రుచికరమైన పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని జగనన్న గోరుముద్ద కింద పిల్లలకు అందించటమే ఈ పథకం ఉద్దేశం. రోజుకో రకమైన మెనూ ఆహార పదార్ధాలతో పాటు వారానికి ఐదు గుడ్లు, మూడు వేరుశెనగ బెల్లం చిక్కిలు పిల్లలకు అందిస్తున్నారు. ఎక్కువ పోషక విలువలతో ప్రతి వారం 15 రకాల పదార్ధాలు పిల్లలకు అందుతున్నాయి. కుక్, హెల్పర్‌ల గౌరవ భృతిని రూ.వెయ్యి నుంచి 3వేలకు పెంచారు. గత ప్రభుత్వం çఏడాదికి మధ్యాహ్న భోజనానికి రూ. 450 కోట్లు వెచ్చిస్తే... ఈ ప్రభుత్వం ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తోంది. అదీ... విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి అంటే!.
గర్భిణులు, బాలింతలు, పసి పిల్లలకు...
వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది ప్రభుత్వం. 7,12,300 మంది గర్భిణులు, బాలింతలు, 6–36 నెలల వయస్సు గల 15,53,400 మంది పిల్లలు మరియు 3 6 సంవత్సరాల వయస్సు గల 9,59,500 మంది పిల్లలు లబ్దిపొందుతున్నారు. దీనికి ఏటా పెడుతున్న ఖర్చు రూ.1956.34 కోట్లు. ఇప్పటివరకు రూ.4849.45 కోట్లు దీనికోసమే ఖర్చు చేశారు.
జగనన్న విద్యా కానుక ..
విద్యార్థి కిట్‌ల రూపంలో బోధన–అభ్యాస సామగ్రిని ‘విద్యా కానుక’గా అందిస్తోంది ప్రభుత్వం. ప్రతి విద్యార్థికీ స్కూల్ బ్యాగ్, స్టిచింగ్ ఛార్జ్‌తో కూడిన 3 జతల యూనిఫారాలు, బెల్ట్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, వర్క్‌బుక్‌లు, 3 మాస్క్‌ల సెట్‌తో సహా ఇంగ్లిష్ –తెలుగు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ అందిస్తారు. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2323.99 కోట్లు ఈ పథకం కింద ఖర్చు చేసింది. 47 లక్షల మంది పిల్లలకు లబ్ది చేకూరింది.
టాయిలెట్ల నిర్వహణ పాఠశాలల నిర్వహణ
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం పాఠశాలల, జూనియర్ కాలేజీల టాయిలెట్ల నిర్వహణ, పాఠశాలల నిర్వహణకోసం ప్రత్యేక నిధిని (ఎంటీఎఫ్, ఎస్‌ఎంఎఫ్) ఏర్పాటు చేయించింది. అమ్మ ఒడిని అందుకుంటున్న తల్లుల భాగస్వామ్యాన్ని పెంచేలా అమ్మ ఒడి కింద ఇచ్చే నిధుల్లో రూ.1000 చొప్పున దీనికి కేటాయించేలా చేసింది. ఇలా ఎంటీఎఫ్ కింద రూ.444.88 కోట్లు, ఎస్‌ఎంఎఫ్ కింద రూ.450 కోట్ల నిధి సమకూరింది. మరుగుదొడ్ల శుభ్రతకోసం 47వేల మంది ఆయాలను నియమించి వారికి నెలకు రూ.6వేల చొప్పున గౌరవభృతిని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment