ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టినా నేరమేనా? | Eenaduwritings on Latest technology in registrations department | Sakshi
Sakshi News home page

ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టినా నేరమేనా?

Published Thu, Aug 17 2023 4:38 AM | Last Updated on Thu, Aug 24 2023 12:55 PM

Eenaduwritings on Latest technology in registrations department - Sakshi

సాక్షి, అమరావతి: ‘కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం’ అన్నట్టు తనకు గిట్టని ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాయడంలో, విష ప్రచారం చేయడంలో ఈనాడు రామోజీరావుది కూడా ఇదే తీరు. ఇందులో భాగంగానే బుధవారం తన విష పుత్రిక ‘ఈనాడు’లో ‘ఉచిత సాఫ్ట్‌వేర్‌ మాకొద్దు.. రూ.34 కోట్లిచ్చి కొంటాం’ అనే శీర్షికతో ఒక తప్పుడు కథనం వండివార్చారు.

మారుతున్న ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెడుతున్నా రామోజీ ఓర్వలేకపోతున్నారు. ప్రజలకు సరికొత్తగా అత్యాధునిక సేవలు అందించడం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పాత టెక్నాలజీకి స్వస్తి పలకడం ‘ఈనాడు’కు కంటగింపుగా మారింది.

కొత్త టెక్నాలజీ ముందుకు వస్తుంటే పాత టెక్నాలజీని వదిలించుకోవడం ఎక్కడైనా జరిగే సర్వ సాధారణమైన విషయం. అయితే ఇది ఘోర తప్పిదంలాగా కళ్ల నిండా పచ్చవిషం నింపుకున్న రామోజీరావుకు కనిపించింది. అందుకే ఆధునిక అవసరాలకు అనుగుణంగా మారకుండా... కేంద్రం ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ ఇస్తోంది కాబట్టి దాన్నే వాడాలంటూ ఈనాడు తన కథనంలో వితండ వాదానికి దిగింది. 

అప్‌గ్రేడ్‌ చేసే స్థాయి వనరులు తనకు లేవన్న ఎన్‌ఐసీ
1999 నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ ఐటీ ఆధారిత సేవలు అందిస్తోంది. అప్పటి అవసరాలకనుగుణంగా నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ).. సీఏఆర్‌డీ (కార్డ్‌) అప్లికేషన్‌ను రూపొందించినా ఆ తర్వాత ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోయింది. అప్పట్లో సంవత్సరానికి కేవలం 2 లక్షల రిజిస్ట్రేషన్లు చేసేందుకు మాత్రమే ఈ అప్లికేషన్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఏటా 25 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్టర్‌ చేసే సామర్థ్యం లేక రెండు దశాబ్దాల నాటి కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌ చతికిలపడింది.

సర్వర్లు మొరాయించడం, రిజిస్ట్రేషన్లు నిలిచి­పోయి ప్రజలు ఇబ్బందులు పడడాన్ని ఈనాడు  పలుసార్లు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులను తప్పించడానికి కార్డ్‌ అప్లికే­షన్‌ను అప్‌­గ్రేడ్‌ చేయడం అనివార్యంగా మారింది. ఈ క్రమం­లోనే రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత అవసరా­లకు అనుగుణంగా కార్డ్‌ను కార్డ్‌ ++ గా అప్‌గ్రేడ్‌ చేయా­లని కోరింది. ఇందుకు అంగీకరించిన ఎన్‌ఐ­సీ 2017లో అందుకు ప్రతిపా­దనలు ఇవ్వడంతో ప్రభుత్వం దాని అమలుకు రూ.13.14 కోట్లను మంజూరు చేసింది. ఆ అప్లికేషన్‌ కోసం రూ.11.82 కోట్లను ఎన్‌ఐసీ ఢిల్లీకి చెల్లించింది. డబ్బు తీసుకు­న్నా టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ చేయడంలో ఎన్‌ఐసీ విఫల­మైంది.

అనేకసార్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధి­కారులు ఎన్‌ఐసీతో చర్చలు జరిపినా తమ­కు ఆ స్థాయి వనరులు లేవని  చెబుతూ వచ్చి­ం­ది. దీంతో రిజిస్ట్రేషన్ల సేవల్లో తరచూ అంతరాయాలు, ఇబ్బందులు తలెత్తేవి. మరోవైపు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 15,004 గ్రామ, వార్డు సచి­వాల­యాల్లోనూ రిజిస్ట్రే­షన్లు సేవలు ప్రారంభించా­లని నిర్ణయించింది. ఇప్ప­టికే 2 వేల సచివాల­యా­ల్లో ఆ సేవలు మొదల­య్యాయి.

ఈ నేపథ్యంలో కార్డ్‌ అప్లికేషన్‌ను అవస­రాలకు తగ్గట్టు అత్యవసరంగా ఆధునికీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కార్డ్‌ ++ అప్లికేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేయలేకపోయిన ఎన్‌ఐసీకి తాము ఇచ్చిన సొమ్మును తిరిగి వెనక్కి ఇచ్చేయాలని, కొత్త టెక్నాలజీ పార్టనర్‌ను చూసు­కుం­టామని రిజిస్ట్రేషన్ల శాఖ ఆ సంస్థకు స్పష్టం చేసింది. దీంతో ఎన్‌ఐసీ రూ.6.20 కోట్లు వెనక్కి ఇచ్చేసింది.

పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ..
ఎన్‌ఐసీ చేతులెత్తేయడంతో గతేడాది రిజిస్ట్రేషన్ల కోసం ఆర్‌టీజీఎస్‌ ద్వారా కొత్త టెక్నాలజీ పార్ట్‌నర్‌ కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ ప్రక్రియలో ఐదు కంపెనీలు పాల్గొన్నాయి. రూ.33.99 కోట్లతో ఎల్‌–1గా నిలిచిన క్రిటికల్‌ రివర్‌ టెక్నాలజీస్‌ కొత్త పార్ట్‌నర్‌గా ఎంపికైంది. అత్యాధునిక టెక్నాలజీతో ప్రైమ్‌ కార్డ్‌ అప్లికేషన్‌ను ఆ కంపెనీ రూపొందించింది. ప్రజలకు ఇబ్బందులు తప్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ పనిని అభినందించాల్సింది పోయి తనకలవాటైన రీతిలోనే ‘ఈనాడు’ విషం చిమ్మింది.

కేంద్రం ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ ఇస్తానంటే వద్దని ప్రభుత్వం రూ.34 కోట్లతో తమకు కావాల్సిన వారికి ఆ కాంట్రాక్టు ఇచ్చిందని అడ్డగో­లు అబద్ధాలను తన కథనంలో వండివార్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రిజిస్ట్రేషన్ల విధానం ఉండాల­నే ఉద్దేశంతో ఎన్‌జీడీఆర్‌ఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను కేంద్రం 2012లో తెచ్చింది. అప్పటికి 14 ఏళ్లకు ముందే మన రాష్ట్రంలో కార్డ్‌ అప్లికేషన్‌ ద్వారా అంతకుమించిన ఐటీ ఆధారిత రిజిస్ట్రేషన్‌ సేవలు అమలవు­తున్నాయి.

కేంద్రం ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా తీసుకుంటే మళ్లీ మనం పాత టెక్నాలజీనే వాడాల్సి ఉంటుంది. ఆ టెక్నాలజీ అప్పటికి ఐటీ సేవలు ప్రారంభించని రాష్ట్రాలకు ఉపయోగం తప్ప అప్పటి­కే టెక్నాలజీ సేవల్లో ముందున్న మన రాష్ట్రానికి కాదు. ఈ విషయాన్ని స్టాంపులు, రిజిస్ట్రే­షన్ల శాఖ కేంద్రానికి చెప్పి తాము ఇంకా ఆధునిక టెక్నాలజీలోకి వెళుతున్నట్లు చెప్పగా అంగీకరించింది. కానీ ‘ఈనాడు’ మాత్రం పాత టెక్నాలజీనే వాడాలంటూ వింత వాదనలు చేస్తోంది.


కొత్త టెక్నాలజీ ద్వారా అత్యాధునిక సేవలు..
రిజిస్ట్రేషన్ల శాఖ కొత్తగా తెచ్చిన ప్రైమ్‌ కార్డ్‌ అప్లికేషన్‌ అత్యాధునిక టెక్నాలజీతో అన్ని అవసరాలను తీర్చేలా పనిచేస్తుంది. దీనిద్వారా త్వరలో ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్‌ సేవలు అందించబోతున్నారు. వినియోగదారులు తమ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో తామే తయారు చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల డేటాబేస్‌లకు అనుసంధానమై అత్యంత కీలకమైన ఆటోమ్యుటేషన్‌ విధానాన్ని ఈ కొత్త టెక్నాలజీ ద్వారానే అందుబాటులోకి తేనున్నారు.

ఈ–సైన్, ప్రైమ్‌ మొబైల్‌ యాప్‌ల ద్వారా సరికొత్త రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రజల ముంగిటకు రానున్నాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలన్నింట్లోనూ ఈ కొత్త టెక్నాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ సేవలన్నింటినీ ఎన్‌జీడీఆర్‌ఎస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా, ఎన్‌ఐసీ పాత సాఫ్ట్‌వేర్‌తో చేసే పరిస్థితి ఏ­మాత్రం లేదు. ఆధునిక అవసరాలకు తగ్గట్టు ఈ సేవలన్నీ అందించేలా ప్రైమ్‌ కార్డ్‌ టెక్నాలజీని నడిపే సామర్థ్యం ఉండడం వల్లే క్రిటికల్‌ రివర్‌ టెక్నాలజీస్‌ కంపెనీని టెక్నాలజీ పార్ట్‌నర్‌గా ఎంపిక చేశారు. ఇది ఈనాడుకు మింగుడుపడకే తన కథనంలో దుష్ప్రచారానికి దిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement