సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా సాకారం చేస్తుంటే, తన ఆత్మీయుడు ఉనికి కోల్పోవడం ఖాయం అని ‘ఈనాడు’ రామోజీరావుకు దిగులు పట్టుకుంది. ఏకంగా 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే నిర్మిస్తుండటం చూసి.. అవి పూర్తయితే టీడీపీకి పుట్టగతులుండవని నిద్ర కరువైంది. ఏదో ఒకటి చేసి ఆ ఇళ్ల నిర్మాణాలు సమాజానికి కన్పించకుండా కనికట్టు చేయాలని ‘నవరత్న ఇల్లు.. పల్లె పేదకు లేదు!’ అంటూ శుక్రవారం ఓ కథనాన్ని వండివార్చారు.
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం ఏకంగా 30.65 లక్షలకు పైగా పేద కుటుంబాలకు గృహ యోగం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 30.65 లక్షల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. వీరికి రూ.56,102 కోట్ల విలువైన భూములను కేటాయించింది. వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే నిర్మిస్తున్నారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఏకంగా రూ.36 వేల కోట్లకు పైగా వెచ్చిస్తోంది.
ఇప్పటి వరకూ రెండు దశల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ఇప్పటికే 17.22 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ వాస్తవాలన్నీ అందరికీ కళ్లెదుటే కనిపిస్తున్నా, ఈనాడుకు మాత్రం కనిపించలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని బురద చల్లుతుండటం దారుణం.
చదవండి: Fact Check: అది రోత రాతల వంటకం
ఇప్పటికే రెండు దశల్లో శర వేగంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా, త్వరలో మూడో దశ కింద మరికొన్ని అదనపు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి, గ్రామీణ ఇలా ఏ లబ్ధిదారులకైనా ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం యూనిట్‌కు రూ.1.80 లక్షలు ఇస్తోంది. దీంతో పాటు పావలా వడ్డీకి రూ.35 వేల బ్యాంక్ రుణ సాయం చేస్తోంది. వీటికి అదనంగా 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా ఇవ్వడంతో పాటు, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై అందిస్తోంది. ఎక్కడైనా కోర్టు కేసులు, లబ్ధిదారు మరణం, లబ్ధిదారుల శాశ్వత వలస వంటి ఇతర సమస్యల కారణంగా ఇంటి నిర్మాణం చేపట్టని సందర్భాల్లో మాత్రమే ఆయా ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి తప్ప లబ్ధిదారులను ఎక్కడా తొలగించలేదు.
Comments
Please login to add a commentAdd a comment