సాక్షి, అమరావతి: విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం వెనుక గల కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేసేలా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ... సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్‌ఐఏను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఇదే కేసుకు సంబంధించి విశాఖలోని ఎన్‌ఐఏ కోర్టులో జరుగుతున్న తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలపాటు నిలిపివేసిన హైకోర్టు, విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
దర్యాప్తు లోపాలనుప్రత్యేక కోర్టు దృష్టికి తీసుకెళ్లిన జగన్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో ఆయనపై జనుపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి హత్యాయత్నం చేశారు. పదునైన కత్తితో జగన్ మెడపై దాడికి ప్రయత్నించారు. జగన్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆయన ఎడమ చేతికి గాయమైంది. ఈ ఘటనను తేలిక చేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ మీడియా సమావేశాలు నిర్వహించారు. కాగా.. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసింది.
జగన్‌ను చంపడమే శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయత్నించాడని ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో పేర్కొంది. ముందస్తు పథకంలో భాగంగానే శ్రీనివాసరావు కోడి కత్తి సంపాదించాడని, అదును చూసి జగన్‌పై దాడి చేశాడని వివరించింది. దీనివెనుక ఉన్న కుట్ర, ప్రేరణ వ్యవహారాన్ని కూడా తదుపరి దర్యాప్తులో తేలుస్తామని ప్రత్యేక కోర్టుకు ఎన్‌ఐఏ వివరించింది. కానీ.. ఎన్‌ఐఏ కుట్ర కోణంపై దృష్టి సారించలేదు. ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడ్డారో తేల్చలేదు.
ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం ఘటన వెనుక ఉన్న కుట్రపై లోతైన దర్యాప్తు జరిపేలా ఎన్‌ఐఏను ఆదేశించాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్‌ఐఏ దర్యాప్తులో లోపాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. శ్రీనివాసరావు వెనుక ఎవరు ఉన్నారన్న విషయాన్ని కూడా ఎన్‌ఐఏ తేల్చలేదని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ ఏడాది జూలై 25న తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ వైఎస్ జగన్ తరఫున న్యాయవాది టి.నాగార్జునరెడ్డి గత వారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై జస్టిస్ శ్రీనివాసరెడ్డి మంగళవారం విచారణ జరిపారు.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తాం: ఎన్‌ఐఏ
వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై ఎన్‌ఐఏ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. ఎన్‌ఐఏ తరఫున హాజరైన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో న్యాయమూర్తి ఎన్‌ఐఏ, నిందితుడు శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఎన్‌ఐఏను ఆదేశించారు.
కాగా.. న్యాయవాది నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. విశాఖపట్నం ఎన్‌ఐఏ కోర్టు జగన్‌మోహన్‌రెడ్డిని సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో న్యాయమూర్తి విశాఖ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న సెషన్స్ కేసు (ఎస్‌జీ) 5/2023కు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ 8 వారాల పాటు నిలుపుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పరిధి లేకున్నా విజయవాడ కోర్టు ఉత్తర్వులిచ్చింది
సీఎం వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏ చార్జిషీట్ దాఖలు చేసిందన్నారు. తదుపరి దర్యాప్తులో అన్ని విషయాలు తేలుస్తామని చార్జిషీట్‌లో పేర్కొన్న ఎన్‌ఐఏ ఆ తరువాత ఎలాంటి దర్యాప్తు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కుట్ర కోణం గురించి అసలు పట్టించుకోలేదన్నారు. ఈ దృష్ట్యా కుట్ర కోణంపై లోతైన దర్యాప్తు జరిపేలా ఎన్‌ఐఏను ఆదేశించాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. అయితే, ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ ఏడాది జూన్ 25న ఉత్తర్వులిచ్చిందన్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో ఎన్‌ఐఏ కోర్టు పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జూలై 21న నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. దీని ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు విశాఖపట్నం ఎన్‌ఐఏ కోర్టు పరిధిలోకి వస్తాయన్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును విచారించే పరిధి విశాఖపట్నం ఎన్‌ఐఏ కోర్టుకు మాత్రమే ఉందని వివరించారు. విచారణ పరిధి లేకపోయినప్పటికీ విజయవాడ కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపిందని, అందువల్ల విజయవాడ కోర్టు ఉత్తర్వులు చెల్లవన్నారు. చట్ట ప్రకారం పరిధి ఉన్న ప్రత్యేక కోర్టు మాత్రమే విచారణ జరపాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment