సాక్షి, అమరావతి: చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులూ విద్యుత్ శాఖను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఇందుకు నిదర్శనం ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు). అనవసర పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో పాటు అధిక బిడ్డింగ్, నాణ్యతలేని బొగ్గు సేకరణ, విదేశీ బొగ్గు కొనుగోలు వరకూ దేనినీ వదిలిపెట్టలేదు.
వీటిలో అవినీతిని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)నే వెల్లడించింది. ముడుపుల కోసం విద్యుత్ రంగాన్ని కకావికలం చేసి, డిస్కంలను అప్పులపాలు చేసి, విద్యుత్ వ్యవస్థను కుంగదీసి భారీ అవినీతిని పెంచి పోషించిన ‘బాబు’ను అరెస్ట్ చేయడం ఏమాత్రం తప్పు కాదని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి
చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే అవసరం లేకపోయినా ఏకంగా 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ళకు ఆర్డర్లు ఇచ్చారు. 2014 మే నుంచి 2015 అక్టోబరు వరకు దాదాపు ఏడాదిన్నరలోనే 13,180 మిలియన్ యూనిట్ల ప్రైవేటు విద్యుత్ కొన్నారు. దీని విలువ రూ.8,286 కోట్లకు పైనే. ఇందులో కొంత విద్యుత్‌ను ఎక్కడా లేని విధంగా యూనిట్ రూ.10కు కొన్నారు. జెన్‌కో విద్యుత్ యూనిట్ రూ.4.50 మాత్రమే ఉంది. అయితే జెన్‌కో ఉత్పత్తి పెంచకుండా చంద్రబాబు ఎంత డబ్బు ఖర్చు చేసైనా ప్రైవేటు కొనుగోళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారు.
ఇందులో రూ. 15 వేల కోట్ల అవకతవకలు జరిగినట్లు ఆరోపణ. ఇందులో ప్రైవేటు ఉత్పత్తిదారుల నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు దాదాపు రూ.4 వేల కోట్లు ముడుపులుగా అందినట్లు అంచనా. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ట్రేడింగ్ కార్పొరేషన్ అయిన ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి రాసిన లేఖలో చంద్రబాబు ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా అధిక ధరలకు ప్రైవేటు నుంచి కొంటున్న విషయాన్ని బయటపెట్టింది.
మూసేస్తే రూ.675.69 కోట్లు నష్టం
చంద్రబాబు హయాంలో బొగ్గు కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్వాకాలను కాగ్ కడిగిపారేసింది. ఇష్టారాజ్యంగా బొగ్గు కొనుగోళ్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాలను బలవంతంగా మూసివేయడం వల్ల ఏపీ జెన్‌కోకు భారీ నష్టం వాటిల్లిన వైనాన్ని ఎండగట్టింది. నాసిరకం బొగ్గును అధిక ధరకు కొన్న ప్రభుత్వ పెద్దల తీరును తప్పుబట్టింది.
డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ) 2011–12లో 22.235 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. కానీ 2015–16 నాటికి విద్యుదుత్పత్తి 19.359 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దీని వల్ల విద్యుదుత్పత్తి ధర యూనిట్‌కు రూ.2.94 నుంచి రూ.4.34కు పెరిగింది. బలవంతంగా మూసివేయడం వల్ల ఆ రెండు విద్యుత్ కేంద్రాలకు రూ.675.69 కోట్లు నష్టం వాటిల్లింది.
అధిక ధరకు నాణ్యత లేని బొగ్గు
మహానది కోల్ లిమిటెడ్ (ఎంసీఎల్) బొగ్గు సరఫరా చేయడంలేదనే సాకు చూపి 2014 జూలైలో 26.61 లక్షల మిలియన్ టన్నుల బొగ్గును, 2015–16లో ఎలాంటి అవగాహన ఒప్పందం కుదుర్చుకోకుండానే 63.5 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ నుంచి ప్రీమియం ధరకు టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014 నుంచి 2016 వరకూ కోల్ ఎనాలిసిస్ నివేదికలు, కోల్ ఇన్వాయిస్‌లను సమీక్షిస్తే జెన్‌కో కొన్న బొగ్గు నాణ్యతలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది.
నాణ్యత లేని రూ.3,179.32 కోట్ల విలువైన 86.02 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును అధిక ధరకు కొనడం వల్ల జెన్‌కోకు రూ.918.61 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. విదేశీ బొగ్గునూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు కొన్నారు. ఇందులో ప్రభుత్వ సంస్థలను ముందు పెట్టి తెర వెనుక కోల్ మాఫియా చక్రం తిప్పింది. రూ.500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయ్యింది. ఇందులో రూ.200 కోట్లు బాబు అండ్ కోకు ముడుపులుగా వెళ్లాయనే ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment