రెచ్చిపోతున్న కల్తీ కేటుగాళ్లు.. | Sakshi Investigative Story On Adulterated Food | Sakshi
Sakshi News home page

ఆహారం.. హాహాకారం

Published Mon, Apr 5 2021 11:15 AM | Last Updated on Mon, Apr 5 2021 11:18 AM

Sakshi Investigative Story On Adulterated Food

మారెప్పగారి రామ్మోహన్, సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ, గుంటూరు నగరాల్లో కల్తీ వంట నూనెలు, నెయ్యి, టీ పొడి తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేంద్రాలను పలు చోట్ల ‘సాక్షి’ గుర్తించింది. దీంతో గురు, శుక్రవారాల్లో ‘సాక్షి ప్రతినిధి’ ఆయా ప్రాంతాల్లో పర్యటించగా.. కల్తీ వ్యవహారం కళ్లకు కట్టినట్లుగా కనిపించింది. విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఇందిరానాయక్‌ నగర్‌లో ఓ తయారీ కేంద్రంలో పామాయిల్, వనస్పతితో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారు. కంపెనీ నిర్వాహకుడు పేరేంటని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించేలోగా వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. వివిధ బ్రాండ్ల పేరిట నెయ్యి, అవు నెయ్యి, ఆయిల్‌ టిన్నులు అక్కడ తయారు చేస్తున్నారు. 

బెజవాడలోని పాతరాజరాజేశ్వరిపేటలో కల్తీ దీపారాధన తైలం తయారు చేస్తున్న తయారీ కేంద్రాన్ని కూడా పరిశీలించగా.. అక్కడ నువ్వుల నూనెలో తవుడు నూనె, కాటన్‌సీడ్‌ ఆయిల్‌లను కలిపి స్వచ్ఛమైన దీపారాధన తైలంగా నమ్మిస్తున్నారు. వాటిని వివిధ బ్రాండ్ల పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అదే ప్రాంతంలో బీరువాల కంపెనీ రోడ్డులోనూ ఇలాంటి తైలమే తయారవుతోంది.

అగ్గి పుల్ల, సబ్బు బిళ్ల, కుక్కపిల్ల.. కాదేదీ కవితకనర్హం అన్నాడో కవి.. పప్పులు, పొడులు, పండ్లు, నూనెలు.. కావేవీ కల్తీకనర్హం అంటున్నారు నేటి కేటుగాళ్లు. ప్రజల ఆరోగ్యమంటే లెక్కలేకుండా, అధికారులంటే భయం లేకుండా, పాప భీతి అసలే లేకుండా ప్రతి ఆహార పదార్థాన్ని కల్తీ చేసేస్తున్నారు. ప్రజలు నిత్యం ఉపయోగించే ఆహారాలే వారి టార్గెట్‌.. కారం పొడిలో ఎరువుల రసాయనాలు, టీ పొడిలో రంపపు పొట్టు.. నెయ్యిలో పామాయిల్, వనస్పతి, పచ్చళ్లలో రసాయనాలు, కరకరలాడే పాప్‌కార్న్, కుర్‌కురేల మాటున కాలకూట విషాలు, నిల్వ ఉంచిన మాంసాలు, పండ్లకు రసాయన పూతలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో కల్తీలు. నిగనిగలాడేలా ప్యాకెట్లు, దాని మీద ప్రముఖ కంపెనీల లోగోలు పెట్టి మాయ చేస్తున్నారు.. ఒక కంపెనీలోనే పది రకాల కల్తీ బ్రాండెడ్‌ సరుకులను తయారుచేస్తున్నారు. ఏది అసలో, ఏది నకిలీయో గుర్తించడానికి కూడా వీలు లేకుండా ప్యాకింగ్‌తో  బోల్తా కొట్టిస్తున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? కల్తీకి సంబంధించి చట్టాలు ఏం చెబుతున్నాయి? ఈ వారం సాక్షి పరిశోధనాత్మక కథనం.. 

తిండి కలిగితే కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌..’ అన్నారు గురజాడ అప్పారావు. కండ సంగతి పక్కనపెడితే మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే నాణ్యమైన ఆహారం అవసరం. ఎంత సంపాదించినా ఖర్చు విషయంలో ఆహార పదార్థాలకే మనం అధిక ప్రాధాన్యం ఇస్తాం. తిండి విషయంలో రాజీ పడితే బతుకుబండి సాగదు గనుక నాణ్యమైన పండ్లు, కూరలు, పప్పులు, నూనెలు, బియ్యం, ఇతర పదార్థాలు కొనాలని అందరూ భావిస్తారు. ఈ భావనే కల్తీ వ్యాపారులకు బలంగా మారుతోంది. అధిక లాభాలకు ఆశపడి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు, నాసిరకం వస్తువులు కలిపి కొందరు వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు.

ఈ వ్యాపారం ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరుగుతుందనుకుంటే తప్పులో కాలేసినట్టే. వాణిజ్య కేంద్రాలుగా విరాజిల్లుతున్న విజయవాడ, గుంటూరు నగరాల్లో ఎక్కువగా సాగుతోంది. ఈ కల్తీ ఆహారపదార్థాలు, నూనెలు, నెయ్యితో చేసిన వంట జనాల ఒంట్లో మంట పెడుతోంది. దీంతో ఏ తినుబండారమైనా నిశ్చింతగా తినాలంటే ఏమవుతుందోనన్న పరిస్థితులు నెలకొన్నాయి. తూతూమంత్రంగా ఆహారభద్రత, టాస్‌్కఫోర్స్‌ దాడులు, కేసులు ఉంటుండడంతో కల్తీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు.

ఆయిల్‌   మాయలు.. 
సాధారణంగా ఇంట్లో చేసే ప్రతి ఆహారపదార్థంలోనూ వంట నూనె తప్పనిసరి. అందులోనూ ఎన్నో రకాల నూనెలు, ఎన్నో కంపెనీలు, మరెన్నో బ్రాండ్లు మార్కెట్లలో కనిపిస్తూ ఉంటాయి. ఇదే అక్రమార్కులకు ఆసరాగా మారింది. తవుడు, కొన్ని రకాల విత్తనాలు, పశువుల కొవ్వులు, ఎముకల నుంచి నూనెలను తయారు చేస్తున్నారు. వైట్‌ ఆయిల్, పామాయిల్‌లను వాటిల్లో కలిపి ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లలోకి విడుదల చేస్తున్నారు. ఇటీవల నరసరావుపేటలో పెద్ద ఎత్తున నకిలీ ఆయిల్‌ తయారు చేస్తున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. అక్కడ ఒకే కంపెనీలో పది రకాల బ్రాండ్లతో ఆయిల్‌ తయారవుతోంది. మార్కెట్‌లో దేనికి ఎక్కువగా డిమాండ్‌ ఉంటే ఆ పేరుతో.. లేక అచ్చం అలాగే వంట నూనెలను తయారు చేస్తూ జనం ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అయినా వేరుశెనగ నూనె అయినా మరే ఆయిల్‌ అయినా ఇక్కడే తయారుచేస్తున్నారు. ఉదాహరణకు ఫ్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లోగో పోలిన బాలాజీ సన్‌ఫ్లవర్, కర్నూలు గ్రౌండ్‌ నట్, లయన్‌ బాలాజీ, శక్తి పామాయిల్‌ ఇలా ఒకే రకమైన ఆయిల్‌తో వంటనూనెలు తయారు చేస్తున్నారు. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లో పామాయిల్‌ నుంచి వేరు చేసిన వైట్‌ వోలిన్, సూపర్‌ ఓలిన్‌లను కలుపుతున్నారు.

ప్రజల కంట్లో కారం..
గుంటూరు అంటేనే ముందుగా గుర్తొచ్చేది కారమే. అలాంటి బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా కొందరు వ్యాపారులు కల్తీ కారంతో డబ్బులు పోగేసుకుంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద మిర్చి మార్కెట్‌ ఉన్న గుంటూరులో సహజంగా పెద్ద సంఖ్యలో కారం మిల్లులు వెలిశాయి. ఇక్కడి నుంచే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కారం పొడి సరఫరా అవుతోంది. కొన్ని మిల్లులు ఇదే అవకాశంగా భావించి అడ్డదారులు తొక్కుతున్నాయి. అసలు కారంలో 40 నుంచి 50 శాతం మేర కల్తీ పొడిని కలుపుతున్నారు. వృధాగా బయటపడేయాల్సిన తొడిమెలను సైతం పొడిగా మార్చి కారంలో కలిపేస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తున ఒకరకమైన వ్యర్థపదార్థాలను దిగుమతులు చేసుకుంటూ ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నాణ్యతలేని ఎండుమిరపతో కారం చేసి, దానికి రంగు కోసం ప్రమాదకర రెడ్‌ ఆక్సైడ్‌ లాంటి రసాయన పదార్థాలను కలిపి మార్కెట్లోకి వదులుతూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. కాలేయం, మూత్రపిండాలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర రోగాలకు కారణమవుతున్నారు. గతేడాది గుంటూరు జిల్లాలో కల్తీ కారం సునామీ సృష్టించింది. కోల్డ్‌ స్టోరేజీలో మిరప బస్తాల మాటున చైనా కారం నిల్వలు వందల టన్నుల కొద్దీ బయటపడ్డాయి.

నెయ్యి..  నానా రకాలు.. 
మనం తినే ఆహారంలో నెయ్యికి ప్రత్యేక స్థానం. అలాంటి స్వచ్ఛమైన నెయ్యిని సైతం కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. పామాయిల్, వనస్పతి, ఇతర రసాయనాలతోపాటు క్యాన్సర్‌కు కారకమైన వైట్‌ ఆయిల్‌ను నెయ్యిలో వాడుతున్నారు.  జంతువుల నుంచి వేరు చేసే కొవ్వునూ, వాటి ఎముకల ద్వారా తయారు చేసే నూనెలను నెయ్యిలో కలుపుతున్నారు. గత ఏడాది చివరిలో ఆహారభద్రతా అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సంయుక్త దాడుల్లో విజయవాడ నగరంలోని పాతపాడు, దేవీనగర్, ఇందిరా నాయక్‌నగర్, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో 400 కిలోల పైగా కల్తీ నెయ్యి పట్టుపడింది. నెయ్యి తయారీలో కెమికల్స్, పాడైపోయిన వెన్నను వాడినట్లు తనిఖీల్లో తేలింది. 

కాటేసే  టీ..
మనలో చాలా మందికి ఉదయం లేవగానే ఒక స్ట్రాంగ్‌ టీ తాగడం అలవాటు. మిగతా దుకాణాలు ఎలాగున్నా టీ, కాఫీ షాపులు మాత్రం ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. అంత డిమాండ్‌ ఉన్న కాఫీ, టీ పొడులు విచ్చలవిడిగా కల్తీ అవుతున్నాయి. మామూలు టీపొడి కన్నా కల్తీ టీపొడి చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. చిక్కగాను, కలర్‌ఫుల్‌గాను కనిపిస్తుంది. రంపపు పొట్టుకు కలర్‌ యాడ్‌ చేసి.. టీ ఫ్లేవర్‌ను కలిపి అందమైన ప్యాకెట్లలో విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లోని టీస్టాళ్లలో దాదాపు 70 శాతం కల్తీ టీ పొడినే వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

పిల్లలకు  ప్రేమతో విషం..
గతంలో పిల్లలు ఏడిస్తే, మారాం చేస్తే బెల్లం ముక్కో, కొబ్బరి ముక్కో, నువ్వుల ఉండో చేతిలో పెట్టేవారు. కాలం మారిందిగా.. ఇప్పుడు మాత్రం పాప్‌కార్న్, కుర్‌కురే ప్యాకెట్లు పిల్లల చేతుల్లో పెడుతున్నారు. అవి మంచి కంపెనీలైతే పర్వాలేదు. కానీ కొన్ని వందల రకాల కుర్‌కురేలు మార్కెట్లను ముంచేస్తుంటే ఏది కల్తీనో, ఒరిజినలో గుర్తుపట్టడం కష్టమే. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాసిరకం తినుబండారాలను ఎక్కువగా తయారు చేస్తున్నారు. వ్యాపార కేంద్రమైన విజయవాడలో పలుచోట్ల తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నగరంలోని రాజరాజేశ్వరిపేట, దేవీనగర్, పాతపాడు, చిట్టినగర్, పాయకాపురం, అజిత్‌సింగ్‌నగర్, గొల్లపూడి, కండ్రిక తదితర చోట్ల ఇవి తయారవుతున్నాయి.

నాసిరకం పదార్థాలతో తినుబండారాలను తయారు చేస్తున్నారు. అంటే వీటిలో వాడే నూనెలు, కారాలు, ఇతర పదార్థాలు అన్నీ నాసిరకమే. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. గుంటూరులోని నల్లచెరువు, వర్కర్స్‌కాలనీ, పొన్నూరు రోడ్డు, సుద్దపల్లి డొంక సెంటర్‌ తదితర చోట్ల పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. అధికారులు దాడులు చేసి కల్తీలను పట్టుకున్నా.. మరో పేరుతో విడుదలవుతున్నాయి. పిల్లలు ఏడుస్తున్నారు కదా అని ఊరూపేరు లేని స్నాక్స్‌ కొనిచ్చారా? ఇక మీ పిల్లలకు మీరే ప్రేమతో విషం ఇచి్చనట్లే. ఇప్పుడు కాకపోయినా దీర్ఘకాలంలో చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

పప్పులు..  కృత్రిమం..
క్యాన్సర్‌ కారకాలైన కృత్రిమ రంగులను కందిపప్పునకు వాడుతున్నారు. ఆకర్షణ కోసం టారా్టజిన్, లెమన్‌ ఎల్లో, మెటానికల్‌ ఎల్లో వంటివి వాడుతున్నారు. వీటిని నిరీ్ణత 0.1 పీపీఎం మించి వాడకూడదు. చాలా వాటిల్లో ఈ మోతాదును మించి వినియోగిస్తున్నారు. ఇవి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. మినప్పప్పు, ఛాయ మినప్పప్పు, మినపగుళ్లు మెరుపు కోసం.. పురుగు పట్టకుండా నిల్వ ఉండేందుకు రసాయన పౌడర్‌ను వాడుతున్నారు. దీని వల్ల జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాలేయ సమస్యలు తలెత్తడంతో పాటు, పేగుకు సంబంధించిన రుగ్మతలు తలెత్తుతాయని అంటున్నారు.

కెమికల్‌  మామిడి.. 
సాధారణంగా ఏప్రిల్‌ మాసంలో చేతికందే మామిడి కాయలను పక్వానికి రాకుండానే కార్బైడ్, ఫైటో కెమికల్స్‌ ద్వారా కృత్రిమంగా పండుగా మార్చేస్తున్నారు. వీటికి రంగు మాత్రమే ఉంటుంది కానీ రుచి ఉండదని ఆహార భద్రతాధికారులు చెబుతున్నారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయంటున్నారు. గత ఏడాది విజయవాడలోని నున్న మ్యాంగో మార్కెట్‌లో ఫైటో కెమికల్స్‌ను వినియోగిస్తున్న కొందరు వ్యాపారులను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 50 లీటర్ల ఫైటో కెమికల్స్‌ సీజ్‌ చేశారు.

తెల్లనివన్నీ పాలు కాదు!
స్వచ్ఛమైన పాలను సైతం కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. విజయవాడలో కొందరు ప్రభుత్వ డెయిరీ పాల పేరిట కల్తీపాలను ఓ ప్రైవేటు కళాశాలకు సరఫరా చేశారు. ప్రకాశం జిల్లా నుంచి తీసుకొచ్చే పాలను విజయవాడ ఆటోనగర్‌లోని రేవా డెయిరీ అనే ప్లాంట్‌లో రీఫిల్లింగ్‌ చేçస్తూ.. అక్కడ పాలను కల్తీ చేసి విక్రయిస్తూ ఆహార భద్రతాధికారులకు పట్టుబడ్డారు. వాస్తవంగా ఎక్కువ శాతం పాలను పాలపొడి ద్వారా తయారు చేస్తూ.. ఆ పాలు స్వచ్ఛమైన వాటిలా కనిపించేందుకు దానిలో ఆయిల్, యూరియా, నురగ కోసం షాంపు తదితర పదార్థాలను వినియోగిస్తున్నారు. ఇలాంటి పాలు తాగడం వల్ల లేదా వాటిని పెరుగుగా మార్చుకుని తినడం వల్ల విరోచనాలతోపాటు కిడ్నీ సంబంధిత వ్యాధులతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఆ మటన్‌ తింటే మటాషే..
ఆదివారం అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది మాంసం. ఎంచక్కా.. ఇంటికి మటనో, చికెనో తీసుకొచ్చి రకరకాల వెరైటీలు చేసుకునేవారు కొందరైతే.. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి రుచులను ఆస్వాదించే వారు ఇంకొందరు. రుచికరమైన ఆహారం తినేందుకు హోటల్‌కు వెళ్లే భోజన ప్రియులు ఇకపై ఆలోచించాల్సిందే. కొన్ని హోటళ్లలో కుళ్లిపోయే స్థితిలో ఉన్న మటన్, రిఫ్రిజిరేటర్లలో వారాల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, హానికర రసాయనాల వాడకం, ఇలా అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘిస్తూ వినియోగదారుల ఆకలిని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

తక్కువ ధరకు వస్తోందని..  
ప్రకాశం, నల్గొండ, గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం సంతలు జరగుతుంటాయి. అక్కడ రోగాల బారిన పడిన వాటిని తక్కువ రేటుకు కొనుగోలు చేసి, శనివారం రాత్రికి విజయవాడకు తెస్తున్నారు. వీటిని అనధికారికంగా వధించి, మామూలు మాంసంతో కలిపి అమ్ముతున్నారు. ఈ నాసిరకమైన మాంసాన్నే హోటళ్లు, రెస్టారెంట్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వారు ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేసి రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి దానినే వండి వడ్డిస్తున్నారు. గత ఏడాది నవంబరు 3వ తేదీన విజయవాడలోని బార్బిక్‌ నేషన్‌ రెస్టారెంట్‌లో ఆహార తనిఖీ, విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. ఫ్రిజ్‌లో ఏకంగా 150 కిలోల మటన్‌ను నిల్వ ఉంచిన విషయం వెలుగుచూసింది. కనీసం 15 రోజుల నాటి ఆ మాంసం బాగా గడ్డకట్టి కుళ్లిపోయే దశకు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత నెల 15వ తేదీన విజయవాడలోని కరెన్సీనగర్, రామచంద్ర నగర్‌లో మటన్‌లో బీఫ్‌ను కలిపి విక్రయిస్తున్న సమయంలో దాన్ని అధికారులు సీజ్‌ చేశారు.

కల్తీకి శిక్షలేమున్నాయి?
కల్తీకి సంబంధించి శిక్షలు, తదితర అంశాలను ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 నిర్దేశిస్తుంది.
నాసిరకం ఉత్పత్తులని తేలితే సెక్షన్‌ 51 ప్రకారం రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
వివరాలు సరిగా పొందుపర్చకపోతే సెక్షన్‌ 52 మేరకు రూ.3 లక్షలు జరిమానా వేస్తారు.
కల్తీ కారకం ఆరోగ్యానికి హానికరం కాకపోతే సెక్షన్‌ 57 ప్రకారం రూ.2 లక్షలు మించకుండా జరిమానా విధిస్తారు. ఠి ఆరోగ్యానికి హానికరం అయితే రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
సురక్షితం కాని ఆహార పదార్థాలు తినడం వల్ల మరణం సంభవిస్తే సెక్షన్‌ 59 ప్రకారం ఏడేళ్లు తక్కువ కాకుండా జైలు, రూ .10 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చు.
లైసెన్సు లేకుండా వ్యాపారం సాగిస్తే సెక్షన్‌ 63 ప్రకారం 6 నెలల వరకు కారాగారం, రూ.5 లక్షల వరకు జరిమానా ఉంటుంది.  

నిబంధనలు ఇవీ...  
ఫుడ్‌సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) చట్టం ప్రకారం ఏదైనా జంతువును వధించాలంటే తప్పనిసరిగా యాంటీమార్టం చేయాలి. 48 గంటల ముందు సంబంధిత కబేళాలోని పశువైద్యుడు పరీక్షించాలి. ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి.
పశువైద్యుడు ఇచ్చిన ధ్రువీకరణ ఆధారంగా కబేళాకు తీసుకెళ్తే ముద్ర వేసి జంతువును వధిస్తారు. తర్వాత పోస్టుమార్టం నిర్వహించి ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చాలి.
కళేబరాన్ని మాంసపు దుకాణానికి తీసుకొచ్చి అమ్మకాలు చేపట్టాలి. ఆ రోజు మాంసం మిగిలితే.. దానిని –18 డిగ్రీల ఉషో్టగ్రత వద్ద కొన్ని గంటలపాటే భద్రపర్చాలి.
సంబంధిత ఆరోగ్య విభాగం అధికారులు దుకాణాలను పరిశీలించాలి. ముద్ర ఉన్న జంతువు మాంసాన్నే విక్రయిస్తున్నారా? అన్నది చూడాలి. 

కల్తీపై ఉక్కుపాదం మోపుతాం..  
ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోం. కల్తీ నెయ్యి, పాలు, పప్పుదినుసులు తయారు చేస్తున్న వ్యాపారులతోపాటు అక్రమాలు చేస్తున్న  స్వీటు షాపులు, హోటళ్లు, మినరల్‌ వాటర్‌ప్లాంట్లపై నిరంతరం నిఘా ఉంచాం. నాలుగేళ్లలో కృష్ణా జిల్లాలో 1,226 దుకాణాల్లో తనిఖీలు చేపట్టి 326 కేసులు నమోదు చేశాం. ఇందులో 126 కేసులు కోర్టుల్లో ఉండగా, 212 కేసులు జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో ఉన్నాయి. కల్తీ నెయ్యి తయారీకి పాల్పడుతున్న 30 కంపెనీలను మూసివేశాం. కల్తీ పాల వ్యాపారులపైనా 20 కేసులు నమోదు చేశాం. కృత్రిమంగా పండ్లను పండిస్తున్న వారిపై 70 కేసులు పెట్టాం. 20 హోటళ్లను, 10 స్వీటు షాపులను సీజ్‌ చేశాం.
 –  పూర్ణచంద్రరావు, ఆహారభద్రతాధికారి, విజయవాడ

కల్తీలతో ప్రమాదకర వ్యాధులు... 
ఆహార పదార్ధాలతో నాలుగు రకాల కారణాలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆహార పదార్థాల కల్తీ, రంగు రుచి వాసన కోసం ఆహార పదార్ధాల్లో కెమికల్స్‌ వాడటం, వాడిన వంటనూనెలను రెండుమూడు సార్లు వినియోగించడం, నిల్వ ఉన్న మాంసంతో ఫుడ్‌ తయారు చేయడం వలన ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. నరాల బలహీనత, మెదడుపై ప్రభావం చూపి మెమరీలాస్, ఇంటలిజెన్స్‌ తగ్గడం, హార్ట్‌ ఫెయిల్యూర్, జీర్ణకోశ వ్యాధులు, అల్సర్స్, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, బోన్‌ వీక్‌ అవడం(ఆస్టియోఫోరోసిస్‌), మజిల్స్‌పై ప్రభావం చూపడం, చర్మం ముడతలు పడటం జరుగుతుంది. వాడిన వంటనూనెనే రెండుమూడు సార్లు వాడటం వలన జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ.
– డాక్టర్‌ కంచర్ల సుధాకర్, విభాగాధిపతి, జనరల్‌ మెడిసిన్, గుంటూరు ప్రభుత్వాస్పత్రి  

నిరంతర నిఘా..  
కల్తీ వ్యాపారులపై నిరంతర నిఘా పెట్టాం. నగర పోలీసు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ బృందం ప్రత్యేకంగా వీటిపై దృష్టి సారిస్తుంది. కల్తీ నెయ్యి కేంద్రాలపై ఇటీవల దాడులు చేశాం. 1,000 కిలోల కల్తీ నెయ్యి సీజ్‌ చేశాం. అలాగే దీపారాధనకు వినియోగించే కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న వ్యాపారిని అరెస్టు చేశాం. అతని వద్ద నుంచి రూ. 5.40 లక్షల విలువైన కల్తీ నెయ్యిని సీజ్‌ చేశాం. 
– బత్తిన శ్రీనివాసులు, పోలీసు కమిషనర్, విజయవాడ

ఎన్నో సమస్యలు 
కందిపప్పులో కేసరిపప్పు కలిపి కల్తీ చేయడం వల్ల వాటిని తినడం వల్ల న్యూరాలజీ సంబంధిత సమస్యలు, పక్ష వాతం వస్తాయి. పసుపు పొడి, కారంపొడుల్లో నిషేధించబడిన రంగులు, చెక్కపొడులు కలిపి కల్తీ చేయడం వల్ల వాటిని తినడం ద్వారా రక్తహీనత, మూర్ఛ రోగం, క్యాన్సర్‌ వ్యాధులు, కంటి చూపుపోవడం వంటి సమస్యలు వస్తాయి. 
– డాక్టర్‌ అనుముల కవిత, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement