భయపెట్టడమే వ్యూహం
సాక్షి రాయచోటి: ఎన్నికల అనంతరం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా సూపర్ సిక్స్ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలకు తెర తీస్తోంది. అన్ని వర్గాలకు పథకాలను అందించి సంక్షేమం ద్వారా ప్రత్యేక ముద్ర వేసుకోవడం ఒక కోణమైతే....హామీలు అమలు చేయని సందర్భంలో ప్రజలు తిరగబడకుండా భయాందోళనలకు గురి చేయడం మరోఎత్తు. ఈ రెండవ కోవను ఎంచుకున్న అధికార పార్టీ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియాతోపాటు శ్రేణులను భయపెట్టే వ్యూహానికి పదును పెట్టింది. అధిష్ఠానం పెద్దల నుంచి సలహాలు, సూచనలతోపాటు సమాచారం రాగానే నేరుగా కిందిస్థాయి కూటమి శ్రేణులు ఫిర్యాదు చేయడం...ఆగమేఘాల మీద పోలీసులు కేసులకు ఉపక్రమిస్తున్నారు. ఎలాగైనా వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయపెట్టి పార్టీ కార్యక్రమాలకు దూరం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ అడుగులు పడుతున్నాయి.
ఫిర్యాదు చేయడం...కేసు నమోదు చేయడం..
కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడచూసినా హత్యలు, అరాచకాలు, అఘాయిత్యాలు, ఘోరాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రశ్నించే గొంతుకలపై కూడా సర్కార్ కత్తి పెడుతోంది. ఎక్కడికక్కడ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కిందిస్థాయి నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు చేశారు. అందులో గాలివీడు మండలం అరవీడుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు హనుమంతరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని రెండు రోజుల విచారణ పేరుతో ముప్పుతిప్పలు పెట్టారు. అనంతరం కోర్టులో హాజరుపెట్టి బెయిలుపై విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వింగ్‌తోపాటు చురుకై న కార్యకర్తలను కూడా టార్గెట్ చేసి వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం, వెంటనే కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిపోయింది.
సినీ నటుడు పోసానిపై ఫిర్యాదు
జిల్లాలో కూటమి నేతల ఫిర్యాదుతో పలువురు వైఎస్సార్ సీపీ నేతలు, సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే పులివెందులలో సజ్జల భార్గవ్‌తోపాటు వర్రా రవీంద్రారెడ్డిమీద కేసులు నమోదు చేశారు. అలాగే రాజంపేట, నందలూరులోనూ వర్రా రవీంద్రారెడ్డిపై పోలీసులు కేసులు పెట్టారు. తాజాగా రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్‌లో టీడీపీ నేతలు సినీ నటులు పోసాని కృష్ణమురళిపై కూడా ఫిర్యాదు చేశారు. ఇలా నేతలు ఫిర్యాదు చేయడం, అలా కేసులు నమోదు కావడం...ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చి పోలీసులు అరెస్టు పర్వానికి తెర తీస్తున్నారు.
పార్టీ శ్రేణులకు అండగా వైఎస్ జగన్
అసభ్యత, అశ్లీలతకు తావు లేకుండా...ప్రభుత్వం చేసే తప్పులు, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయని సీఎం చంద్రబాబు నైజంపై సోషల్ మీడియాలో ప్రచారం చేయండి...అండగా నేనున్నానంటూ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వేదికలుగా గొంతు విప్పి ప్రశ్నించండి...అందరికీ అండగా ఉంటానంటూ వైఎస్ జగన్ భరోసా ఇస్తున్నారు. కార్యకర్తలతోపాటు నేతలను ఎప్పటికప్పుడు ఇన్‌ఛార్జిల ద్వారా సంబంధిత బాధితుల గురించి అడుగుతూ ధైర్యాన్ని నింపుతున్నారు.
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియానే టార్గెట్
అధినేతల నుంచి కిందిస్థాయి నేతలకు సమాచారం రాగానే ఫిర్యాదు
కీలక నేతలను పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టడమే పథక రచన
ఇప్పటికే అరవీడుకు చెందిన హనుమంతరెడ్డి బెయిలుపై విడుదల
రాజంపేటలో సినీ నటుడు పోసానిపై ఫిర్యాదు
వైఎస్సార్ సీపీ శ్రేణులను భయపెట్టడమే లక్ష్యంగా అడుగులు
నేతలు, కార్యకర్తలకు అండగా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment