పెద్ద దర్గా ఉరుసుకు వేళాయె
కడప కల్చరల్: ఆధ్యాత్మిక చింతనకు...మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న కడప పెద్ద దర్గా (అమీన్ పీర్ దర్గా) ఉరుసుకు వేళయింది. ప్రశాంతతకు నిలయంగా జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచిన ఈ దర్గా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోంది. శనివారం నుంచి ఈ నెల 21వరకు జరిగే ప్రధాన ఉరుసు ఉత్సవాలకు దర్గా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే విద్యుద్దీప శోభతో ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది.
విలక్షణ సూఫీ ఆధ్యాత్మిక కేంద్రం
ఈ దర్గాకు సంబంధించిన ప్రథమ సూఫీ హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మహమ్మద్ చిష్ఠివుల్‌ఖాద్రి కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి 16వ శతాబ్దంలో ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. సూఫీ తత్వాలతో ప్రజల్లో దైవ చింతనను పెంచిన ఈయనకు నాటి కడప నవాబులు ప్రియ శిష్యులుగా ఉండేవారు. ఆయన వారసునిగా ప్రస్తుతం హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ 11వ పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. దర్గాపై అపార విశ్వాసం గల భక్తులు మన దేశంతోపాటు పాకిస్తాన్, గల్ఫ్ దేశాలలో కూడా ఉన్నారు.
సామాజిక సేవలు
కేవలం ఆధ్యాత్మిక చింతనతోపాటు దర్గా ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. పేద యువతులకు కుట్టు, అల్లికల్లో శిక్షణ, యువకులకు ఐటీఐ ద్వారా వృత్తి విద్య అందిస్తున్నారు. దర్గాకు సమీపంలో నిరుపేద, ప్రతిభగల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఆధునిక విద్య నేర్పే పాఠశాలలను నెలకొల్పి విద్యా దానం చేస్తున్నారు.
● అన్ని మతాలకు చెందిన వారు దర్గాను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో దర్గా పరిసరాల్లో ఉన్న ఇతర మతాలకు చెందిన ప్రార్థనాలయాలను కూడా ఉరుసు సందర్భంగా మరమ్మతులు చేసి నూతనంగా తీర్చిదిద్దడం విశేషం.
కడప పెద్దదర్గా
రేపటి నుంచి పెద్ద దర్గా ప్రధాన ఉరుసు
వారం రోజులపాటు నగరం కళకళ
పూర్తయిన ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment