ట్రాక్టర్ ఢీకొని వీఆర్‌ఓకు గాయాలు
మదనపల్లె : ట్రాక్టర్ ఢీకొని వీఆర్‌ఓ గాయపడిన సంఘటన మంగళవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. నిమ్మనపల్లె మండలం దిగువమాచిరెడ్డిగారిపల్లెకు చెందిన రాజగోపాల్(53) కురబలకోట మండలంలో వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం విధులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా, నిమ్మనపల్లె–మదనపల్లె మార్గంలోని వశిష్ట స్కూల్ వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో రాజగోపాల్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో ఎడమ కాలు విరిగింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
విద్యుత్ స్తంభం ఏర్పాటు
బి.కొత్తకోట : స్థానిక బలిజవీధిలో విద్యుత్ స్తంభం కూలిపోతుంటే తాడుతో నిలిపారు. దీనిపై ‘విద్యుత్ స్తంభాన్ని తాడుతో నిలిపారు’ అనే శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. డిస్కం అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. డిస్కం ఏఈ గిరిబాబు, లైన్‌మ్యాన్ లక్ష్మినారాయణ, సిబ్బంది పాత విద్యుత్ స్తంభాన్ని తొలగించి కొత్త దాన్ని ఏర్పాటు చేయించారు. అలాగే ఇంతకు మునుపు విద్యుత్ తీగలు కిందకు వాలిపోయేవి. ఇప్పుడా పరిస్థితి లేకుండా తీగలు ఎత్తులో ఏర్పాటు చేయడంతో సమస్య పరిష్కారమైంది.
Comments
Please login to add a commentAdd a comment