ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ
మదనపల్లె : ఓ వ్యక్తిపై జరిగిన దాడి ఘటనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కాగా, మంగళవారం డీఎస్పీ దర్బార్ కొండయ్యనాయుడు క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. పట్టణంలోని ఎస్టేట్‌కు చెందిన జయభారత్‌పై ఈ నెల7న పట్టణానికి చెందిన రెడ్డిశేఖర్, మధుబాబు, మునీంద్రనాయక్‌లు బెంగళూరు రోడ్డులో దాడికి పాల్పడ్డారు. వీరి మధ్య ఓ భూమికి సంబంధించి క్రయ, విక్రయాల్లో భాగంగా జయభారత్ కొంత నగదు వీరికి బాకీ పడ్డాడు. నగదు సకాలంలో చెల్లించకపోవడంతో వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు ఈనెల 13న వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ శివకుమార్ దాడి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా డీఎస్పీ బెంగళూరు రోడ్డులో ఘటన జరిగిన ప్రాంతంలో చుట్టుపక్కల వారిని విచారణ చేశారు.
కోడిపందెం ఆటగాళ్ల అరెస్ట్
మదనపల్లె : కోడి పందెం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. పట్టణంలోని వీవర్స్ కాలనీ వద్ద కోడి పందెం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,840, రెండు పందెంకోళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం
సిద్దవటం : మండల పరిధి టక్కోలు గ్రామ సమీపంలోని పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను కడపకు తరలిస్తున్న 10 ట్రాక్టర్లను మంగళవారం స్వాధీనం చేసుకున్నామని ఇన్‌చార్జి తహసీల్దారు మాధవీలత తెలిపారు. ఆ ట్రాక్టర్లను స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించామని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదంలో
వైద్య విద్యార్థి దుర్మరణం
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు– శెట్టిగుంట జాతీయ ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి దుర్మరణం చెందాడు. తిరుపతి ఎస్‌వీ మెడికల్ కళాశాలలో చదువుతున్న అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నల్లమల్ల తండాకు చెందిన మహేంద్ర నాయక్ (21) బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. మృతుడి తల్లిదండ్రులు తులసీధర్ నాయక్, తిరుపాల్ భాయీలకు విషయం తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment