‘ఏపీపీఎస్సీ’ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి యం.విశ్వేశ్వర నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ చాంబర్‌లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించే డిపార్ట్‌మెంటల్ పరీక్షలపై డీఆర్వో ఏపీపీఎస్సీ పరీక్షల జిల్లా ప్రత్యేక అధికారులైన పర్యవేక్షకులు జి.అశోక్ (అసిస్టెంట్ సెక్రటరీ, మానిటర్), యస్.కె. కాశింవల్లి (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్)తో కలిసి పరీక్షల విధులు కేటాయించిన లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ పరీక్షలు ఈ నెల 18 నుంచి 23 వరకు రెండు సెషన్లలో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కార్యకలాపాలకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పరీక్షలను సజావుగా, ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా జరిగేలా చూడాలని సూచించారు. పోలీసు శాఖ ప్రతి సెంటర్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అభ్యర్థులు, వారి వెంట వచ్చే వారికి ఎలాంటి కొరత లేకుండా ఆయా పరీక్ష కేంద్రాల యాజమాన్యాలు అన్ని వసతులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని కడప నగర పరిధిలో 1, చింతకొమ్మదిన్నె మండలంలో 3, ప్రొద్దుటూరు మండల పరిధిలో 1 పరీక్షా కేంద్రలతో కలిపి మొత్తం 5 కేంద్రాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు, లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment