రెవెన్యూ సదస్సులు పట్టవా!
మదనపల్లె : రైతుల సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులంటూ కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటుంటే....క్షేత్ర స్థాయిలో ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. సమస్యలు పట్టించుకోకుండా అధికారులు తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. మదనపల్లె మున్సిపల్ పరిధిలోని కమ్మపల్లెలో బుధవారం రెవెన్యూ సదస్సు జరిగింది. ప్రజలు తమ సమస్యలను వివరిస్తుంటే...నోడల్ అధికారి, డీఎల్‌డీఓ అమరనాథరెడ్డి మాత్రం తనకేమీ పట్టదన్నట్లు ఇలా న్యూస్ పేపర్ చదువుతూ కనిపించారు. రైతులు రెవెన్యూ సిబ్బందితో గొడవ పడుతున్నా.. ఆయన మాత్రం పేపర్ చదవడంలో నిమగ్నమై కనిపించారు. సదస్సు నిర్వహణకు నోడల్ అధికారిగా ఉన్న డీఎల్‌డీఓ ఇలా చేయడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు.
ఎర్రచందనం కేసులో ఒకరికి జైలు శిక్ష
సిద్దవటం : ఎర్రచందనం కేసులో నేరం రుజువు కావడంతో తమిళనాడుకు చెందిన పొన్నన్ పలణి స్వామికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ జడ్జి బుధవారం తీర్పు వెలువరించినట్లు సిద్దవటం ఇన్‌చార్జి రేంజర్ నయూమ్‌అలీ తెలిపారు. సిద్దవటం అటవీశాఖ కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ 11 ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్‌లో తమిళనాడుకు చెందిన పొన్నన్ పలనీ స్వామి పాల్గొనడంతో అప్పటి సిద్దవటం అటవీ శాఖ అధికారి కె.ప్రసాద్ 15 అక్టోబర్, 2018లో నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేశారన్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. అప్పటి సిద్దవటం బీట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, రేంజర్ ప్రసాద్ సాక్ష్యాలతో కేసు నిరూపణ కావడంతో పొన్నన్ పలనీస్వామికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.6లక్షల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. దీంతో నిందితుడిని నెల్లూరు జైలుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment